నేపాల్‌లో ఆరుగురితో ప్రయాణిస్తున్న ఓ హెలికాప్టర్ గల్లంతైంది. ‘మనంగ్ ఎయిర్’కు చెందిన ఓ హెలికాప్టర్ సోలుకుంభు నుంచి కాఠ్‌మాండూకు ప్రయాణిస్తుండగా సంబంధాలు తెగిపోయాయి. అధికారులు అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టారు. ఓ విమానం ద్వారా హెలికాప్టర్‌తో కమ్యూనికేషన్ నెలకొల్పే దిశగా యత్నాలు జరుగుతున్నాయి. ఈ హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న ఐదుగురు మెక్సికన్ వాసులని తెలుస్తోంది.
9ఎన్-ఏఎంవీ కాల్ సైన్‌తో వ్యహరించే ఈ హెలికాప్టర్ సోలుకుంభులోని సుర్కీ అనే ప్రదేశం నుంచి గాల్లోకి ఎగిరిన 15 నిమిషాల తర్వాత కంట్రోల్ స్టేషన్‌తో సంబంధాలు తెగిపోయాయని అధికారులు తెలిపారు. ఈ ఘటన ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో చోటు చేసుకున్నట్లు చెప్పారు. దీనిని సీనియర్ పైలట్ చెట్ గురుంగ్ నడుపుతున్నారని.. అతడితోపాటు ఐదుగురు విదేశీయులు కూడా ప్రయాణిస్తున్నారని వెల్లడించారు. ఈ ఘటన చోటు చేసుకొన్న ప్రదేశం ఎవరస్ట్ శిఖరానికి సమీపంలో ఉంటుందని వివరించారు. ఆ హెలికాప్టర్లో అమర్చిన జీపీఎస్ సంకేతాలు లమ్జురాపాస్ వద్ద నిలిచిపోయినట్లు నేపాల్ సివిల్ ఏవియేషన్ అధికారి జ్ఞానేంద్ర భుల్ చెప్పారు.