ప్రపంచాన్ని అణు దాడుల పేరుతో భయపెడుతున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు గట్టి షాక్ తగిలింది. తాజాగా పరీక్షించిన ఓ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విఫలమైంది. సైనిక నిఘా ఉపగ్రహాన్ని జూన్ 11లోపు ప్రయోగించనున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే ఉత్తర కొరియా.. ఓ బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విఫలమైందని దక్షిణ కొరియా సైన్యం ప్రకటించింది. రాకెట్ ప్రయాణం అసహజంగా సాగిందని తెలిపింది. రాకెట్ శిథిలాలు సముద్రంలో పడిపోయాయని పేర్కొంది.
అమెరికా, దాని భాగస్వాముల సైనిక కదలికల పర్యవేక్షణ కోసం నిఘా ఉపగ్రహాన్ని సిద్ధం చేసినట్లు ప్రకటించిన కిమ్.. ఇప్పటికే ఆ విషయాన్ని జపాన్‌కు తెలిపింది. కొరియన్ ద్వీపకల్పానికి పశ్చిమాన రెండు ప్రాంతాలు, ఫిలిప్పీన్స్‌కు తూర్పున ఉన్న మరో ప్రాంతంలో శిథిలాలు పడతాయని జపాన్ కోస్ట్ గార్డ్‌కు సమాచారం ఇచ్చింది. సైనిక నిఘా తొలి ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి తుది సన్నాహాలు చేయాలని కిమ్ ఆదేశించిన మరుసటి రోజే బాలిస్టిక్ క్షిపణి పరీక్షించటం చర్చనీయాంశంగా మారింది.