భారత్‌పై పాకిస్థాన్ దుర్భుద్ధి మరోసారి ఆధారాలతో సహా బయటపడింది. పాక్ నుంచి మన దేశంలోకి పెద్ద ఎత్తున ఆయుధాలు, డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తాజాగా పాక్ అధికారి ఒకరు బట్టబయలు చేశారు. భారత్‌కు తాము డ్రోన్లతో డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేస్తుందని నిజమేనని స్వయంగా ప్రధాని సలహాదారే అంగీకరించినట్లు సమాచారం.
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు రక్షణ సలహాదారుగా ఉన్న మాలిక్ మహమ్మద్ అహ్మద్ ఖాన్ ఇటీవల పాక్ జియో న్యూస్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు హమీద్ మీర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోను జర్నలిస్టు మీర్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
‘‘ప్రధాని ప్రత్యేక సలహాదారు మాలిక్ సంచలన విషయం చెప్పారు. పాకిస్థాన్-భారత్ సరిహద్దుల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న స్మగ్లర్లు హెరాయిన్‌ను సరఫరా చేసేందుకు డ్రోన్స్‌ను ఉపయోగిస్తున్నారు. వరద బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ, పునరావాసం కల్పించకపోతే వారు కూడా స్మగ్లర్ల ముఠాతో చేరే అవకాశముందని మాలిక్ చెప్పారు’’ అని జర్నలిస్ట్ మీర ట్వీట్ చేశారు.