యూకే ప్రభుత్వం ఫైజర్, బయోఎన్‌టెక్‌కు చెందిన కోవిడ్ వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అత్యవసరం వినియోగం నిమిత్తం ఆ వ్యాక్సిన్‌కు యూకే ఆమోదం తెలిపింది. ఈ క్రమంలోనే వచ్చే వారంలో అక్కడ వ్యాక్సిన్‌ను పంపిణీ చేయనున్నారు. డిసెంబర్ 7వ తేదీ నుంచి యూకేలో ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఇంకా ఆ తేదీ రాకుండానే సదరు వ్యాక్సిన్ డార్క్ నెట్‌లో లభిస్తోంది. దీంతో ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
కొండారు డ్రగ్ డీలర్లు ఫైజర్‌కు చెందిన కోవిడ్ వ్యాక్సిన్‌ను డార్క్ నెట్‌లో అమ్ముతున్నారు. వ్యాక్సిన్ ఒక్క డోసును 1300 డాలర్లకు (దాదాపుగా రూ.95వేలు) విక్రయిస్తున్నారు. కావాలంటే ఎక్కడికైనా వ్యాక్సిన్‌ను ఎలాగైనా సరే డెలివరీ చేస్తామని కూడా వారు చెబుతుండడం గమనార్హం. అయితే నిజానికి ఫైజర్ వ్యాక్సిన్‌ను ఇచ్చే వరకు దాన్ని -70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో స్టోర్ చేయాల్సి ఉంటుంది. అంతి అల్ట్రా కోల్డ్ ఎక్విప్‌మెంట్ నిజానికి ప్రపంచంలోనే కాదు, యూకేలోనూ లేదు. కేవలం కొన్ని ఎంపిక చేసిన హాస్పిటళ్లలోనే ఆ సదుపాయం ఉంది. దీంతో అక్కడి హాస్పిటళ్లను ప్రస్తుతం ఈ సదుపాయం కోసం సిద్ధం చేస్తున్నారు. అయితే డ్రగ్ డీలర్లు డార్క్ నెట్‌లో ఆ విధంగా వ్యాక్సిన్ అందజేస్తామని చెబుతుండడం పలు అనుమానాలకు తావిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఫైజర్ వ్యాక్సిన్‌ను -70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద స్టోర్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని ఎలా రవాణా చేస్తారు ? అందుకు సరైన ఎక్విప్‌మెంట్ ఉండాలి. దానికి భారీగా ఖర్చవుతుంది. అలాంటప్పుడు డార్క్ నెట్‌లో డ్రగ్ డీలర్లు ఆ వ్యాక్సిన్‌ను ఎలా పంపిస్తారు ? అని వైద్య నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇందులో ఏదో స్కాం ఉందని, ప్రజలు ఆశపడి వ్యాక్సిన్‌ను కొనవద్దని, నకిలీ వ్యాక్సిన్‌ను వారు అమ్మేందుకు అవకాశం ఉంటుందని, కనుక ప్రభుత్వాలు పంపిణీ చేసే వరకు ఆగాలని, అలాంటి వారి మాటలకు ఆశపడి వ్యాక్సిన్ ను అమ్ముతామని చెబితే ఎవరూ నమ్మవద్దని, అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నకిలీ వ్యాక్సిన్ అయితే ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుందని అంటున్నారు.