మరోసారి విదేశీ పర్యనటకు ప్రధాని మోదీ.. జులై 13న ఫ్రాన్స్​కు.. 15న అబుదాబికి

-

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. జులై 13, 14వ తేదీల్లో ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ అహ్వానం మేరకు జులై 14న జరిగే బాస్టిల్ డే వేడుకల్లో మోదీ గౌరవ అతిథిగా పాల్గొననున్నారు. మోదీని జులై14 పరేడ్‌కు స్వాగతించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని.. మేక్రాన్‌ ట్వీట్‌ చేశారు.

మరోవైపు బాస్టిల్‌ డే వేడుకలకు విదేశీ నేతలను ఆహ్వానించండం సాధారణమైన విషయం కాదని భారత విదేశాంగ శాఖ తెలిపింది. చివరిసారిగా 2017లో బాస్టిల్‌ డే వేడుకలకు అమెరికా అధ్యక్షుడిని ఆహ్వానించారని పేర్కొంది. ఈ పర్యటనలో ప్రధాని దిగ్గజ సీఈవోలతో సమావేశం అవుతారని చెప్పింది. అధ్యక్షుడు మేక్రాన్‌తో ద్వైపాక్షిక సమావేశాలు జరుపుతారని వెల్లడించింది.

ప్రపంచ సమస్యలపైనా మేక్రాన్‌-మోదీ చర్చలు జరపనున్నారని వివరించింది. వాణిజ్యం ఈ పర్యటనలో కీలకం కానుందన్నది. బాస్టిల్‌ డే వేడుకల్లో భారత సైనిక బృందం కూడా కవాతు చేయనుంది. ఫ్రాన్స్‌ పర్యటన ముగిసిన అనంతరం జులై 15న ప్రధాని అబుదాబిలో పర్యటిస్తారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో మోదీ చర్చలు జరుపుతారు.

Read more RELATED
Recommended to you

Latest news