రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో ప్రధాని మోదీ బుధవారం రోజున ఫోన్లో మట్లాడారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ఐదోసారి విజయం సాధించిన పుతిన్‌కు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఉక్రెయిన్-రష్యా సంక్షోభ పరిష్కారానికి సంప్రదింపులు, చర్చలే మార్గమని అన్నారు.
అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో కూడా మోదీ ఫోన్ మాట్లాడారు. సంక్షోభ ముగింపునకు భారత్ తన వంతు కృషి చేస్తుందని, మానవతా సాయాన్ని కొనసాగిస్తుందని భరోసా ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత తమ దేశాల్లో పర్యటించాలని మోదీ ఫోన్ మాట్లాడిన సమయంలో ఇరు దేశాల అధ్యక్షులు ఆహ్వానించారు.
భారత్-రష్యా మధ్య ద్వైపాక్షిక, వ్యూహాత్మక బంధాలను రాబోయే రోజుల్లో మరింత బలోపేతం చేసేందుకు ఇరువురు అంగీకరించారని మోదీ తెలిపారు. ఉక్రెయిన్ చుట్టూ నెలకొన్న పరిస్థితులు, పలు అంతర్జాతీయ అంశాలపైనా సుదీర్ఘంగా పుతిన్, మోదీ చర్చించినట్లు భారత విదేశాంగశాఖ వెల్లడించింది. మరికొన్ని రోజుల్లో జరగనున్న పార్లమెంటు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ఓ ప్రకటన జారీ చేసింది.