రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న అసంబద్ధ ఉచిత హామీలపై నిషేధం విధించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఈ పిటిషన్ చాలా ముఖ్యమైన విషయమని, దీన్ని గురువారం జాబితాలో ప్రస్తావిస్తామని బుధవారం రోజున సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. వచ్చే నెల 19వ తేదీ నుంచి సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ పిల్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రకటించే ఉచిత హామీలపై నిషేధం విధించాలని ఈ పిల్‌లో న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ కోరారు. ఉచితాలు రాజ్యాంగ విరుద్ధమని, వీటిని నిరోధించేందుకు చర్యలు తీసుకొనేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. అసంబద్ధ హామీలు ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు అని, రాజ్యాంగ స్ఫూర్తికీ విఘాతమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఖజానాలోంచి ఓటర్లకు డబ్బు ఇవ్వడం లంచం కిందకే వస్తుందన్న ఆయన ఇది అనైతికమని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య విలువలను, సంప్రదాయాలను రక్షించాలంటే వీటికి అడ్డుకట్ట వేయాల్సిందేనని అన్నారు.