పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టా పదవి నుంచి వైదొలిగారు. ఆయన ప్రభుత్వంపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడం వల్ల ఆయన తన పదవికి రాజీనామా చేశారు. తనపై అవినీతి ఆరోపణలు రావడం వల్ల ఆశ్చర్యానికి గురయ్యానని అన్నారు. తప్పకుండా విచారణకు సహకరిస్తానని తెలిపారు. ఆ దేశ అధ్యక్షుడు మార్సెలో రెబెలో డి సౌజాను కలిసిన అనంతరం మంగళవారం రోజున ఆంటోనియో కోస్టా తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. సోషలిస్టు పార్టీ సారథ్యంలో పోర్చుగల్ ప్రధాన మంత్రిగా ఆంటోనియో కోస్టా 2015 నుంచి అధికారంలో కొనసాగుతున్నారు.
పోర్చుగల్‌లో లిథియం మైనింగ్, హైడ్రోజన్ ప్రాజెక్టుల నిర్వహణలో అక్రమాలకు సంబంధించిన విచారణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంటోనియో కోస్టా ప్రభుత్వం గద్దె దిగాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా.. ఈ వ్యవహారంలో ఆంటోనియా కోస్టా సన్నిహితులైన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విచారణలో భాగంగా ప్రధాని, మంత్రుల నివాసాల్లో సుమారు 140 మంది డిటెక్టివ్‌లు తనిఖీలు నిర్వహించినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి.