చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్‌లో కాల్పులు కలకలం రేపాయి. జన్ పలాచ్ స్క్వేర్లోని చార్లెస్ విశ్వవిద్యాలయంలో తుపాకీ మోత రక్తం చిందింది. ఓ సాయుధుడు ఫిలాసఫీ విభాగం భవనంలో విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 15 మంది దుర్మరణం చెందారు. మరో 20మందికి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దుండగుడిని మట్టుబెట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారని అధికారులు వెల్లడించారు.
కాల్పుల కలకలంతో పోలీసులు యూనివర్సిటీ చుట్టుపక్కల ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకున్నారు. కాల్పుల జరిగిన భవనంలో ఇంకా పేలుడు పదార్థాలు ఉండొచ్చనే అనుమానంతో సోదాలు చేశారు. అయితే దుండగుడు అదే విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థిగా గుర్తించిన అంతర్గత శాఖ మంత్రి విట్ రాకుసన్ చెక్ కాల్పుల ఘటన వెనుక ఏ తీవ్రవాద సంఘాలు లేవని స్పష్టం చేశారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.