రష్యాలో మద్దతుదారుల నిరసనలతో వాతావరణం ఒక్కసారి వేడెక్కింది. రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీని మాస్కో హైకోర్టు రెండున్నర ఏళ్లు జైలు శిక్షను విధించింది. దీంతో నావల్నీ మద్దతుదారులు ఆందోళన చేపడుతున్నారు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, గతంతో ఆయనకు విధించిన శిక్షకు సంబంధించి షరతులు ఉల్లంఘించినందుకు గానూ ఈ శిక్షను విధించినట్లు మాస్కో కోర్టు వెల్లడించింది. గతేడాది ఆగస్టులో అలెక్సీ నావల్నీపై విష ప్రయోగం జరిగింది. ఈ మేరకు ఆయన జర్మనీలో ఐదు నెలల పాటు చికిత్స తీసుకుని జనవరి 17వ తేదీన రష్యాకు చేరుకున్నారు. విషయం తెలుకున్న రష్యా పోలీసులు ఆయనను ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. అయితే తనపై వస్తున్న ఆరోపణలు అధికార పార్టీ సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు.
రష్యా ప్రతిపక్ష నేత నావల్నీ అరెస్ట్ చేయడంపై అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వస్తోంది. మాస్కో కోర్టు తీర్పుతో విశ్వసనీయత ఓడిందని ఐరోపా ఖండంలోని ప్రధాన మానవ హక్కుల సంస్థ కౌన్సిల్ ఆఫ్ యూరప్ తెలిపింది. మాస్కో తీర్పు ఊహించలేనిదని, అత్యంత ఘోరమైనదని బ్రిటన్ విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్ వెల్లడించారు. చట్టబద్ధమైన పాలనకు, పౌర స్వేచ్ఛకు వ్యతిరేకంగా మాస్కో తీర్పు ఉందని జర్మనీ విదేశాంగ మంత్రి హీకో మాస్ తెలిపారు. రష్యా పౌరుల హక్కులను కాపాడటంలో విఫలమైందని, నావల్నీని తక్షణమే విడుదల చేయాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వ్యాఖ్యానించారు.