బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతోపాటు ఆస్ట్రాజెనెకా కంపెనీ కలిసి సంయుక్తంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన విషయం విదితమే. ఈ వ్యాక్సిన్‌ను భారత్‌లో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తోంది. అయితే ప్రస్తుతం దేశంలో ఈ వ్యాక్సిన్‌తోపాటు కోవాగ్జిన్ ను కూడా ఇస్తున్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ఇతర దేశాలకు ఎగుమతి కూడా చేస్తున్నారు. కానీ సౌతాఫ్రికా మాత్రం తమ దేశానికి పంపిన 10 లక్షల కోవిషీల్డ్ డోసులను వెనక్కి తీసుకోవాలని సీరమ్ ఇనిస్టిట్యూట్‌ను కోరినట్లు తెలిసింది.
సౌతాఫ్రికాలో ఉన్న కోవిడ్ స్ట్రెయిన్ పై కోవిషీల్డ్ వ్యాక్సిన్ ప్రభావం చూపకపోవచ్చని సౌతాఫ్రికా భావిస్తున్నట్లు తెలిసింది. అందుకనే కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను తిప్పి పంపించనున్నట్లు తెలుస్తోంది. 10 లక్షల కోవిషీల్డ్ డోసులను ఈ నెల ఆరంభంలో సౌతాఫ్రికాకు పంపించారు. మరో 5 లక్షల డోసులను అక్కడికి పంపేందుకు సిద్ధమయ్యారు. అయితే వ్యాక్సిన్ ప్రభావం చూపించదని, అందువల్లే సౌతాఫ్రికా కోవిషీల్డ్‌ను వెనక్కి తీసుకోవాలని సీరమ్ సంస్థను కోరినట్లు తెలిసింది. దీనిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కాగా మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆస్ట్రాజెనెకాకు చెందిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేరియెంట్‌తోపాటు అదే కంపెనీకి చెందిన మరో వ్యాక్సిన్ వేరియెంట్‌కు కూడా అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.