ఉత్తర కొరియాలో వరణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. భీకర వరదలతో ఆ దేశం అతలాకుతలం అవుతోంది. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల పలు ప్రాంతాలు నీటమునిగాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించిన అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ విపత్తు సహాయక చర్యల్లో స్వయంగా పాల్గొంటున్నారు. రెస్క్యూ సిబ్బందితోపాటు బోటులో వెళ్లి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రస్తుత పరిస్థితిని అంచనా వేశారు. వర్షాల కారణంగా ఉత్తర కొరియాలో బుధవారం నాటికి 4,100 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 7,410 ఎకరాల పంటకు నష్టం వాటిల్లినట్లు సమాచారం.
అయితే ఈ విపత్కర పరిస్థితుల్లో ఉన్న ఉత్తర కొరియాకు ఊహించిన వైపు నుంచి సాయం ఆఫర్ వచ్చింది. పొరుగు దేశానికి సాయం అందించేందుకు దక్షిణ కొరియా ముందుకు వచ్చింది. వరదలు ముంచెత్తుతున్న దాయాది దేశానికి సహాయ సామగ్రిని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తూ.. ఎలా చేరవేయాలన్న దానిపై తక్షణమే స్పందించాలని ఉత్తర కొరియా రెడ్ క్రాస్ సంస్థను కోరింది. అయితే ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ కిమ్ సర్కారు ఈ ప్రతిపాదనపై స్పందించకపోవడం గమనార్హం.