ఓ పోర్న్ స్టార్ నోటికి తాళం వేయడానికి ఆమెకు డబ్బు ముట్టజెప్పినట్లు మనహాటన్ గ్రాండ్ జ్యూరీ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇవాళ మన్హాటన్ కోర్టు ఎదుట ట్రంప్ హాజరుకానున్నారు. ఈ ఆరోపణలకు సమాధానం ఇవ్వనున్నారు. ఈ క్రమంలో సోమవారం ఫ్లోరిడాలోని తన మార్ ఏ లాగో నివాసం నుంచి న్యూయార్క్ చేరుకున్న ట్రంప్ ఇవాళ కోర్టులో ప్రకటన చేసి ఈరోజు రాత్రి మార్ ఏ లాగోకు తిరిగి వెళ్తారు.
అమెరికా చరిత్రలో ఒక మాజీ అధ్యక్షుడు క్రిమినల్ నేరారోపణను ఎదుర్కోవడం ఇదే ప్రథమం. 2006లో ట్రంప్, తానూ ఓ కార్యక్రమంలో కలుసుకున్నామనీ, తరవాత హోటల్లో శృంగారంలో పాల్గొన్నామని స్టార్మీ డేనియల్స్ అనే శృంగార చిత్రాల నటి ఆరోపించింది. ఈ వ్యవహారాన్ని గుట్టుగా ఉంచాలంటూ ట్రంప్ న్యాయవాది మైకేల్ కోహెన్ 2016 అధ్యక్ష ఎన్నికలకు నెలరోజుల ముందు డేనియల్స్‌కు డబ్బు ముట్టజెప్పారన్నది ఆరోపణ. ఇది నిజమేనని కోహెన్ ఒప్పుకున్నారు.
ఈ కేసులో ట్రంప్‌పై క్రిమినల్ అభియోగం మోపాలని గ్రాండ్ జ్యూరీ నిర్ణయించింది. ఆయనపై చేసిన ఆరోపణలను సీల్డు కవరులో ఉంచారు. ఆందులో ట్రంప్‌పై 30 ఆరోపణలు ఉన్నట్లు సీఎన్ఎన్ వార్తా సంస్థ కథనం పేర్కొంది. వాటిని కోర్టులో 10-15 నిమిషాలపాటు వినిపిస్తారు.