అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కు తన కేబినెట్‌లో చోటిస్తానని అన్నారు. అలా కానిపక్షంలో సలహాదారుడిగానైనా నియమించుకుంటానని తెలిపారు. మస్క్ చాలా ఇంటెలిజెంట్ అంటూ ప్రశంసించారు. ట్యాక్స్ క్రెడిట్‌లు, పన్ను ప్రోత్సాహకాలు సాధారణంగా ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూర్చే అంశాలు కావని అభిప్రాయపడ్డ ట్రంప్.. విద్యుత్ వాహనాలపై ఇస్తున్న 7,500 డాలర్ల ట్యాక్స్ క్రెడిట్‌ను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తానని వెల్లడించారు.
ఇటీవల ట్రంప్- మస్క్ మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. ఈ మధ్యే ట్రంప్ను మస్క్ ఎక్స్ వేదికగా ఇంటర్వ్యూ కూడా చేశారు. అయితే మస్క్కు పదవి ఇస్తానని ట్రంప్ అనడం ఇది తొలిసారి కాదు. గతంలో 2016లో గెలిచిన సమయంలో రెండు కీలక సలహా మండళ్లకు మస్క్‌ను ఎంపిక చేశారు ట్రంప్. కానీ, పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి బయటకు రావాలనే ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2017లోనే మస్క్ రాజీనామా చేశారు.