హౌతీలపై దాడి తప్ప మాకు మరో మార్గం లేదు: బ్రిటన్‌

-

ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై వరుస దాడులకు తెగబడుతున్న హౌతీలపై అగ్రరాజ్యం అమెరికా ఉక్కుపాదం మోపుతోంది. హౌతీలపై బ్రిటన్తో కలిసి వరుస దాడులు చేస్తోంది. ఈ విషయంపై తాజాగా బ్రిటన్‌ విదేశాంగ మంత్రి డేవిడ్‌ కామెరూన్‌ స్పందించారు. హౌతీలపై సైనిక చర్య తప్ప తమకు మరో మార్గం లేదని ఆయన అన్నారు. ఎర్ర సముద్రంలో దాడుల గురించి పలు మార్లు హెచ్చరించామని అయినా వారు పట్టించుకోలేదని తెలిపారు. కీలకమైన జల రవాణా మార్గాన్ని హౌతీలు అడ్డుకుంటే యూకేలో నిత్యావసరాల ధరలు పెరిగిపోతాయని వెల్లడించారు. ఈ క్రమంలోనే స్వేచ్ఛాయుత సముద్రయానాన్ని రక్షించేందుకు తాము అమెరికాతో కలిసి హౌతీలపై దాడులు చేశామని వివరించారు.

భవిష్యత్తులో హౌతీలు తీరు మార్చుకోకుండా దాడులు కొనసాగిస్తే బ్రిటన్‌ దళాలు మరోసారి యెమెన్‌పై దాడి చేస్తాయని కామెరూన్ హెచ్చరించారు. చెప్పిన మాటలను చేతల్లో కూడా చూపించడానికి ఏ మాత్రం వెనకాడమని తేల్చి చెప్పారు. హమాస్‌కు మద్దతుగా దాడులు చేస్తున్నామంటూ హౌతీలు చెప్పటం సరికాదన్న ఆయన.. ప్రపంచ దేశాలకు చెందిన అన్ని నౌకలపై వారు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో కూడా తమ సంకీర్ణ దళాల కార్యాచరణ ఇలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version