ఎర్ర సముద్రంలో రవాణా నౌకలపై వరుస దాడులకు పాల్పడుతున్న హౌతీ రెబల్స్ పై మరోసారి అమెరికా, బ్రిటన్‌కు చెందిన సైన్యం విరుచుకుపడింది. తమ నౌకలపై దాడులు ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తూ యెమెన్‌లోని వారి స్థావరాలే లక్ష్యంగా శనివారం రోజున మరోసారి దాడులకు తెగబడ్డాయి. ఈ విషయాన్ని అమెరికా డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ ఏ ప్రకటనలో తెలిపారు. ఈ విషయంలో మిత్రదేశాలైన ఆస్ట్రేలియా, బహ్రెయిన్, కెనడా, డెన్మార్క్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్ దేశాలు కూడా తమకు సహకరించాయని వెల్లడించారు.
అమెరికా, యూకేకు చెందిన మిలిటరీ బలగాలు కలిసి యెమెన్‌లోని హౌతీల స్థావరాలపై దాడులు జరిపాయని ఆస్తిన్ తెలిపారు. ఈ సంయుక్త చర్య హౌతీలకు స్పష్టమైన హెచ్చరికలు పంపించిందని తాము భావిస్తున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ షిప్పింగ్‌పై వీరు చేస్తున్న అక్రమ దాడులను ఆపకపోతే, మున్ముందు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎర్ర సముద్రంలో చట్టబద్ధంగా సరకు రవాణా చేస్తున్న అమెరికా సహా అంతర్జాతీయ నౌకలపై ఇరాన్ మద్దతిస్తున్న హౌతీల దాడులను తాము చేపట్టిన ఈ సంయుక్త దాడులు ఆపుతాయని ఆస్టిన్ అన్నారు.