ఓ అపార్ట్మెంటులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే ఆ భవనంలోని అన్ని ఫ్లోర్లకు మంటలు వ్యాపించాయి. ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే పదుల సంఖ్యలో ఆ మంటల్లో సజీవంగా దహనమైపోయారు. ప్రమాదాన్ని గమనించి అప్రమత్తమైన మరికొందరు అక్కడి నుంచి పరుగులు తీసి తమ ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘోర అగ్ని ప్రమాదం వియత్నాంలో చోటుచేసుకుంది.
వియత్నాంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 50కి పైగా సజీవదహనమయ్యారు. అపార్ట్మెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడం వల్ల పదుల సంఖ్యలో మృతి చెందగా.. అనేకమంది గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి రాజధాని హనోయ్లో జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
సుమారు 70 మందిని రక్షించామని.. మరో 54 మంది క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. పది అంతస్తుల భవనంలోని పార్కింగ్ ప్రాంతంలో మంగళవారం రాత్రి మంటలు మొదలయ్యాయని ప్రత్యక్షసాక్షి ఒకరు చెప్పారు. అవి తర్వాత పై అంతస్తులకు వ్యాపించాయని.. ఈ ఘటనలో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయని తెలిపారు. ఈ ఘటన ఎలా జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నట్లు అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు వెల్లడించారు.