అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల్లో ప్రస్తుతం మార్మోగుతున్న పేరు వివేక్ రామస్వామి. భారతీయ మూలాలున్న వివేక్ 2024లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలో దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనిపై తాజాగా ఆయన స్పందించారు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున తానే బరిలోకి దిగొచ్చని వివేక్ రామస్వామి ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఉంటే.. ఆయనకు మద్దతిస్తానని స్పష్టం చేశారు.
ఆదివారం ఓ వార్తా సంస్థ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో వివేక్ మాట్లాడుతూ.. ఇక తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే.. న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్న ట్రంప్‌ను క్షమిస్తానని వివేక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలా చేస్తే దేశం మళ్లీ ఏకం కావడానికి దోహదపడుతుందని చెప్పారు. తదుపరి దేశాధ్యక్షుడిగా ఇది తన ప్రాధాన్య అంశం కాకపోయినా దేశం ముందుకు సాగడానికి అవసరమని వివేక్ అభిప్రాయపడ్డారు. అమెరికాను ముందుకు తీసుకెళ్లగలిగే సమర్థులకే ఓటు వేస్తానని వివేక్ అన్నారు.