చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాంగ మంత్రి చిన్‌గాంగ్‌ను తొలగించింది. ఆయన స్థానంలో తిరిగి.. వాంగ్ యీని నియమించింది. గత నెల రోజులుగా చైనా విదేశాంగ శాఖ మంత్రి చిన్‌గాంగ్ కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. ఆయన చాలా కీలక సమావేశాల్లో కూడా పాల్గొనలేదు. ఆయన లేకపోవడం వల్ల పలు సమావేశాలను చైనా వాయిదా వేసింది కూడా.
అయితే తాజాగా చిన్‌గాంగ్‌ను తొలగిస్తూ చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో తిరిగి వాంగ్ యీని నియమించింది. ఈ నిర్ణయానికి అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆమోదముద్ర వేసినట్లు ప్రభుత్వ వార్తాసంస్థ జిన్హువా పేర్కొంది. తొలగింపునకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. చిన్‌గాంగ్ కనిపించకపోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
చిన్‌గాంగ్ కంటే ముందు ఈ పదవిలో వాంగ్ యీ ఉండేవారు. 2013 నుంచి 2022 వరకు ఆ మంత్రిత్వ శాఖను ఆయనే నిర్వహించారు. మంత్రిత్వ శాఖ నుంచి తప్పించేటప్పుడు అంతకంటే పెద్దదైన ‘చైనా కమ్యూనిస్ట్ పార్టీ విదేశీ వ్యవహారాల కమిషన్’కు డైరెక్టర్‌గా ఆయన్ని నియమించారు. సీపీసీలో స్టేట్ కౌన్సిలర్ పదవినీ ఆయనకే ఇచ్చారు.