రష్యా – ఉక్రెయిన్ ల మధ్య భీకర యుద్ధం ఇంకా సాగుతోంది. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ లోని పలు భూభాగాలను ఆక్రమించుకుంది. ఇక తాజాగా రష్యాలోని భూభాగలపై ఉక్రెయిన్ దండయాత్ర చేస్తోంది. సరిహద్దును దాటి రష్యాలోని కస్క్ ప్రాంతంలోకి చొరబడిన ఉక్రెయిన్ బలగాలు భీకర దాడులతో బెంబేలెత్తిస్తున్నాయి. మాస్కో సైనికులపై పైచేయి సాధించి తాజాగా అక్కడి సుద్జా పట్టణాన్ని పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ప్రకటించారు.
సుద్జాలో తమ మిలిటరీ కమాండర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు జెలెన్‌స్కీ తెలిపారు. సుద్జాకు వాయవ్యాన 45 కిలోమీటర్ల దూరంలోని గ్లుష్కోవ్ ప్రాంతం వైపు కీవ్ సేనలు దూసుకొస్తున్నాయన్న సమాచారంతో ఆ ప్రాంతాన్నీ ప్రజలంతా ఖాళీ చేయాల్సిందిగా కస్క్ తాత్కాలిక గవర్నర్ అలెక్సీ స్మిర్నోవ్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రష్యాలోని బొరిసోగ్లెబ్‌స్క్, సావస్లీకా వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ల దాడిలో రెండు హ్యాంగర్లు సహా కొన్ని ఇతర ప్రాంతాలు దెబ్బతిన్నట్లు ఉపగ్రహ ఛాయాచిత్రాల విశ్లేషణతో స్పష్టమైంది.