భారతదేశ ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్న నరేంద్ర మోదీకి స్వదేశ నేతలతో పాటు విదేశీ నేతలు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే పలువురు దేశాధినేతలు మోదీతో ఫోన్లో మాట్లాడి విషెస్ చెప్పారు. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా మోదీకి ఫోన్ చేసి లోక్సభ ఎన్నికల్లో గెలిచి మూడోసారి అధికారంలోకి వస్తున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ క్రమంలోనే జెలెన్స్కీ మోదీకి ఓ ఆహ్వాన వినతిని చేశారు. తీరిక చేసుకుని ఉక్రెయిన్‌లో పర్యటించాల్సిందిగా ఆయన కోరారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో స్విట్జర్లాండ్ వేదికగా జరిగే ప్రపంచ శాంతి సదస్సులో అత్యున్నత స్థాయి ప్రాతినిధ్యం వహించాలని భారత్‌కు జెలెన్స్కీ విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ ప్రాముఖ్యత, పాత్రను ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అన్ని దేశాల్లో శాంతి నెలకొల్పేందుకు అందరం కలిసి పని చేయడం చాలా కీలకం అని జెలెన్స్కీ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే తమ దేశంలో పర్యటించాలని మోదీకి విజ్ఞప్తి చేశారు.