ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ సహా మరికొందరు సైనిక అధికారులు, రాజకీయ నేతలను హతమార్చేందుకు రష్యా పన్నిన కుట్రను తాము భగ్నం చేశామని ఉక్రెయిన్ అధికారులు కొద్దిరోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ఘటనతో తన వ్యక్తిగత రక్షణను పర్యవేక్షించే విభాగాధిపతి (బాడీగార్డ్ చీఫ్)పై జెలెన్‌స్కీ వేటు వేశారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో స్టేట్ ప్రొటెక్షన్ డిపార్ట్‌మెంట్ అధిపతి సెర్గియ్ లియోనిడోవిచ్ రుడ్‌ను తొలగించినట్లు పేర్కొన్నారు. అయితే ఆయణ్ను తప్పించడానికి కారణాలను మాత్రం బయట పెట్టలేదు.
కొద్దిరోజుల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ కుట్రకు సంబంధించి స్టేట్ గార్డ్ విభాగానికి చెందిన ఇద్దరు కర్నల్స్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఉక్రెయిన్ తెలిపింది. రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ పన్నిన హత్యా ప్రణాళిక అమలులో వారి పాత్ర అనుమానాస్పదంగా ఉందని వెల్లడించింది. గతంలోనూ జెలెన్‌స్కీ అంతానికి రష్యా పలుమార్లు కుట్ర పన్నినట్లు పేర్కొంది. మరోపక్క.. పుతిన్ ప్రభుత్వం తన వాంటెడ్ లిస్ట్‌లో జెలెన్‌స్కీ పేరును చేర్చింది.