అమలాపురంలో అల్లర్ల నేపథ్యంలో కోనసీమలో ఇంటర్నెట్ సేవలను ఐదు రోజులైనా ఇంకా పునరుద్ధరించే లేదు. దీంతో ముమ్మిడివరం, అమలాపురం, కొత్తపేట, పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. వర్క్ ఫ్రం హోం చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఆరోగ్యశ్రీ, ఉపాధి హామీ పనుల వివరాల నమోదు, డిజిటల్ లావాదేవీలకు అంతరాయం ఏర్పడగా కొందరు ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. అమలాపురంలో విధ్వంసకాండ జరిగి ఐదు రోజులు కావస్తోంది.
అమలాపురం ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం అక్కడ ప్రశాంతత వాతావరణం నెలకొని ఉంది. ప్రజలకు నిత్య కార్యక్రమాలకు ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అల్లర్లు జరిగిన మరుసటి రోజు నుంచే పూర్తిగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. అవాంఛనీయ సంఘటనలు, గొడవలు జరగకుండా, వాట్సాప్ గ్రూపు లో రెచ్చగొట్టే అంశాలు ఫార్వర్డ్ చేయకుండా, ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.