ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ ఎడిషన్ ఈ సారి దుబాయ్‌లో జరగనున్న విషయం విదితమే. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8వ తేదీ వరకు ఐపీఎల్ జరగనుంది. అయితే కరోనా నేపథ్యంలో ఈసారి టోర్నీ దుబాయ్‌కి షిఫ్ట్ అవ్వగా.. అక్కడ పూర్తిగా బయో సెక్యూర్ బబుల్ వాతావరణంలో మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. టోర్నీ జరిగే తేదీలను ప్రకటించినా.. పూర్తి స్థాయి షెడ్యూల్‌ను ఐపీఎల్ యాజమాన్యం ఇంకా ప్రకటించలేదు. కాగా ఆదివారం మధ్యాహ్నం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనున్న నేపథ్యంలో అందులో టోర్నీ పూర్తి షెడ్యూల్‌ను ప్రకటిస్తారని తెలుస్తోంది.
ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పాల్గొననున్నారు. అందులో ఐపీఎల్ షెడ్యూల్‌తోపాటు టోర్నీకి సంబంధించిన స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌వోపీ)పై చర్చించనున్నట్లు తెలిసింది. సమావేశం ముగిశాక ఫ్రాంచైజీలకు సదరు ఎస్‌వోపీ గైడ్‌లైన్స్ బుక్‌లెట్‌ను ఇస్తారని సమాచారం. అందులో ప్లేయర్లు టోర్నీ సందర్భంగా ఏం చేయాలి, ఏం చేయకూడదు.. తదితర అన్ని వివరాలు ఉంటాయని తెలుస్తోంది.
కాగా ఐపీఎల్ జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే ఫ్రాంచైజీలు ప్లేయర్లతో టచ్‌లోకి వచ్చాయి. టోర్నీకి తమ ప్లేయర్లు ఎవరెవరు అందుబాటులో ఉంటారు అనే విషయాలపై ఫ్రాంచైజీలు చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఇక ప్లేయర్లకు సంబంధించిన ఎక్విప్‌మెంట్‌ను కూడా ఇప్పటికే ఫ్రాంచైజీలు తయారు చేయించి పెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇవాళ జరిగే సమావేశం కోసం అటు ఫ్రాంచైజీలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.