కరోనా వల్ల గతేడాది వేసవిలో జరగాల్సిన ఐపీఎల్ వాయిదా పడి గత సెప్టెంబర్ నుంచి నవంబర్ నెల వరకు జరిగింది. అయితే కరోనా ప్రభావం తగ్గడం, వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తుండడం, ప్రేక్షకులను స్టేడియంలలోకి అనుమతిస్తుండడంతో ఈసారి ఐపీఎల్ అనుకున్న సమయానికే మన దేశంలోనే జరుగుతుందని స్పష్టమవుతోంది. కానీ ఈసారి కేవలం రెండు వేదికల్లోనే మొత్తం ఐపీఎల్‌ను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ముంబై, అహ్మదాబాద్‌లను వేదికలుగా ఎంపిక చేయనున్నట్లు తెలిసింది.
ముంబైలో బ్రబౌర్న్ స్టేడియం, వాంఖెడె స్టేడియం, డీవై పాటిల్ స్టేడియం.. మొత్తం 3 స్టేడియంలు ఉండగా, అహ్మదాబాద్‌లో ఇటీవలే పునర్నిర్మించిన మొతెరా స్టేడియం అన్ని హంగులతో మ్యాచ్‌లకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ఈ రెండు వేదికల్లోనే ఈసారి ఐపీఎల్ మొత్తాన్ని నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలిసింది. సాధారణంగా ప్రతి ఏడాది అన్ని జట్లకు చెందిన హోం గ్రౌండ్‌లలో మ్యాచ్‌లను నిర్వహిస్తూ వస్తున్నారు. కానీ ఈసారి పరిస్థితి వేరు కదా. కనుక కేవలం రెండు వేదికలకే ఐపీఎల్‌ను పరిమితం చేయాలని చూస్తున్నట్లు తెలిసింది.
ఇక ఈ సారి ఐపీఎల్ వచ్చే ఏప్రిల్ నెల రెండో వారంలో ప్రారంభం కానున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ తేదీలు, వేదికలపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక ఇటీవలే ప్లేయర్లకు మరోమారు వేలం నిర్వహించగా.. పలువురు ఆటగాళ్లు భారీ మొత్తాలకు అమ్ముడయ్యారు. ఈ క్రమంలో ఈసారి ఐపీఎల్‌ను ఎలా నిర్వహిస్తారు అన్న అంశంతోపాటు భారీ ధరలకు అమ్ముడైన ప్లేయర్లు ఎలా ఆడుతారు ? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.