రెడ్డి అనివుంటే వాళ్లు అగ్రకులానికి చెందుతారా? ఎస్సీ అవుతారా? ఎస్టీ అవుతారా? అనే సందేహం ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ ప్రజల మెదళ్లను తొలిచేస్తోంది. ఎవరికీ తెలియకుండా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలో ఏమైనా మార్పులు చేసిందా? అనే సందేహం కూడా వెంటాడుతోంది. అమరావతి రాజధాని పరిధిలోని అసైన్డ్ భూముల అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించి అక్రమాలకు జరిగాయంటూ చేసిన ఫిర్యాదువల్లే ఈ విషయం ట్రెండింగ్‌లో ఉంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి నారాయణపై పెట్టిన కేసు ఎస్సీ, ఎస్టీ కేసు కాబట్టి, పిర్యాదు చేసింది దళితుడైన ఆళ్ల రామకృష్ణారెడ్డి కాబట్టి.
ఆళ్ల ఫిర్యాదు చేయవచ్చా?
అమరావతి పరిధిలోని అసైన్డ్ భూములకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి నారాయణ అక్రమాలకు పాల్పడ్డారని వారిపై చర్యలు తీసుకోవాలంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా వీరిద్దరిపై ఎస్సీ, ఎస్టీ చట్టంకింద కేసు నమోదుచేసి 23న దర్యాప్తునకు రావాలంటూ నోటీసులు అందజేశారు. దీనిపై కోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫిర్యాదు చేసింది ఆళ్ల రామకృష్ణారెడ్డి. పేరుచివర రెడ్డి అని ఉంది. అంటే అగ్రకులానికి చెందిన వ్యక్తి అని స్పష్టంగా తెలుస్తోంది. ఫిర్యాదు చేయనిది ఎవరంటే దళితులు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలంటే దళితులే ఫిర్యాదు చేయాలి. కానీ థర్డ్ పార్టీ కింద కేసు నమోదు చేశారు. అలా చేయవచ్చా? చేయకూడదా? అనే సందేహం ఇప్పుడెవరికీ కలగడంలేదు. ఎందుకంటే ఏపీలో అధికార పార్టీ చెప్పిందే వేదం.. రాసిందే రాజ్యాంగం.. అమలు చేసేవే చట్టాలు.
ఆళ్ల మదిలో ఉన్న దళితులెవరు?
జీవో నెంబరు 41 వల్ల తమకు నష్టం జరిగిందంటూ తన నియోజకవర్గానికి చెందిన దళితులే తన వద్ద వాపోయారని ఆళ్ల తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ కొంతమంది ఎవరో తెలియదు. ఎక్కడుంటారో తెలియదు. బహుళా ఆళ్ల రామకృష్ణారెడ్డి మెదడులో ఉండిఉండొచ్చు. ఊరూ పేరూ లేనివారి తరపున థర్డ్ పార్టీ ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయవచ్చా? రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగితే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఫలానా వర్గానికి నష్టం చేశారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే దాని మీద కేసు పెట్టి ఆయనను లోపల వేయవచ్చా? అనే సందేహాలు ప్రజలను వెంటాడుతున్నాయి. భవిష్యత్తులో ఎప్పుడైనా అధికార మార్పిడి జరిగితే అప్పుడ చూద్దాంలే! అని సరిపెట్టుకుంటున్నారు. ప్రజలంటే ఎంతైనా సర్దుకుపోయేవారుకదా!!.