నిజంగానే క్లౌడ్ బ‌ర‌స్ట్ జ‌రుగుతోందా? కేసీఆర్ వ్యాఖ్య‌ల్లో వాస్తవం ఎంత‌?

-

ఇటీవ‌ల తెలుగు రాష్ట్రాల్లో ఆకాశానికి చిల్లు ప‌డిందా అన్న‌ట్టుగా వ‌ర్షాలు ప‌డుతున్నాయి. కుండ‌పోత వాన‌ల‌తో గోదావ‌రి ప‌రివాహ‌క ప్రాంతాలు క‌కావిక‌లం అయ్యాయి. వేల సంఖ్య‌లో వ‌ర‌ద ముంపు ప్రాంతాల ప్ర‌జ‌లు నిరాశ్ర‌యుల‌య్యారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌ సీఎం కేసీఆర్ విదేశాలు క్లౌడ్ బ‌ర‌స్ట్ చేసి ఉంటాయ‌నే అనుమానాలను వ్య‌క్తం చేశారు. ఈ వ్యాఖ్య‌లు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించాయి. ఇటీవ‌ల న‌మోద‌వుతున్న ఎడ‌తెరిపి లేని భారీ వ‌ర్షాలు ఈ వ్యాఖ్య‌లకు బ‌లాన్ని చేకూరుస్తున్నాయి. వీటిలో ఎంత వ‌ర‌కు వాస్త‌వం ఉందో ఒక సారి తెలుసుకుందాం.

ఈ మేఘ విస్ఫోటం అంటే ఏంటీ?

త‌క్కువ స‌మ‌యంలో కుండ‌పోత వాన‌లు కుర‌వ‌డాన్ని మేఘ విస్ఫోటం(క్లౌడ్‌బరస్ట్‌)గా వాతావ‌ర‌ణ శాఖ‌(IMD) చెబుతోంది. అంటే 20 నుంచి 30 చ.కి.మీ పరిధిలో గంటకు 10 సెం.మీ వర్షపాతం నమోద‌వ‌డం అన్న‌మాట‌. దీంతో ఒకే సారి వ‌ర‌ద‌లు పోటెత్తుతాయి. ఒక్కోసారి ఉరుములు, పిడుగులు ప‌డ‌తాయి. స్వల్ప పరిధిలో రెండు గంటల వ్యవధిలోనే 5 సెం.మీ, అంతకంటే ఎక్కువ వర్షం ప‌డినా దాన్ని మినీ క్లౌడ్‌బరస్ట్‌గా చెబుతుంటారు. కానీ, స్వల్ప సమయంలో సంభవించే భారీ వర్షాలన్నింటినీ క్లౌడ్‌ బరస్ట్‌గా పరిగణించలేం. అయితే మేఘ విస్పోటం ఎప్పుడు, ఎక్క‌డ ఎలా జ‌రుగుతుందో చెప్ప‌డం క‌ష్టం. వీటి గురించి త‌క్కువ స‌మాచార‌మే అందుబాటులో ఉంది. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్ లాంటి ఎత్తైన ప్ర‌దేశాల్లో ఇలాంటి విప‌త్తులు సంభ‌విస్తుంటాయ‌ని శాస్త్రవేత్త‌లు చెబుతున్నారు. ఇటీవ‌ల అమ‌ర్‌నాథ్ శివ‌లింగం స‌మీపంలో వ‌ర‌ద‌ల‌తో 16 మంది చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే. దీనిని కూడా క్లౌడ్ బ‌ర‌స్ట్‌గానే చెబుతున్నారు.

ఇది ఎలా సంభ‌విస్తుంది..?

రుతుప‌వ‌నాలు దేశంలోకి ప్ర‌వేశించ‌గానే అరేబియా స‌ముద్రం నుంచి తేమ‌తో కూడిన గాలులు వీస్తాయి. ప‌ర్వ‌త ప్రాంతాల్లో ఈ గాలులు అధిక తేమ‌తో ప‌య‌నిస్తాయి. కొన్ని సంద‌ర్భాల్లో వ‌ర్షం ప‌డే ప‌రిస్థితులు ఏర్ప‌డిన‌ప్ప‌టికీ వాన ప‌డ‌కుండా మేఘాలు ఘ‌నీభ‌విస్తూనే ఉంటాయి. ఈ ప్ర‌క్రియ ఇలాగే ప‌లుమార్లు కొన‌సాగితే మేఘాలు బ‌రువెక్కి ఒకేసారి బ‌ర‌స్ట్ అవుతాయి. దీంతో స్వ‌ల్ప కాలంలో కుండ‌పోత వాన‌లు కురుస్తాయి. ఇలాంటి క్లౌడ్ బ‌ర‌స్ట్‌లు హిమాల ప్రాంతాల్లో ఏటా ప‌దుల సంఖ్య‌లో జ‌రుగుతున్న‌ట్టు నివేదిక‌లు వెల్ల‌డిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version