దేవుడి ముందు కూర్చుని కళ్లు మూసుకోగానే.. ఆఫీసు పనులు, వంటింటి చింతలు లేదా పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా? పూజలో ఉండగా మనసు ఎక్కడో విహరిస్తుంటే చాలామంది భయం, అపరాధ భావంతో కుంగిపోతుంటారు. “భక్తితో ప్రార్థించలేకపోతున్నానే, ఇది పాపం కాదా?” అని ఆందోళన చెందుతారు. నిజానికి ఇది మీ ఒక్కరి సమస్య కాదు మనిషి సహజ గుణం. ఈ మానసిక సంఘర్షణ వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను, మనసును ఎలా నిలకడగా ఉంచుకోవాలో సరళంగా తెలుసుకుందాం.
పూజ చేసే సమయంలో మనసు పక్కదారి పట్టడం అనేది అపరాధం లేదా పాపం అస్సలు కాదు. మనసు స్వభావమే చంచలత్వం. గాలికి దీపం ఎలా ఊగిసలాడుతుందో, ఆలోచనలు కూడా అలాగే కదులుతుంటాయి. భగవంతుడికి మీ ఏకాగ్రత కంటే మీ ఉద్దేశం (సంకల్పం) ముఖ్యం.
మీరు దేవుని ముందు కూర్చున్నారంటేనే మీకు ఆయనపై గౌరవం, నమ్మకం ఉన్నాయని అర్థం. ఆలోచనలు వస్తున్నాయని పూజ ఆపేయడం కంటే, ఆ ఆలోచనలను గమనిస్తూ తిరిగి నెమ్మదిగా దైవ నామం వైపు మళ్లించడం ఒక సాధన. దీనిని ‘చిత్తశుద్ధి’ కోసం చేసే ప్రయత్నంగా చూడాలి తప్ప, పాపంగా భావించి మనసును మరింత కలవరపెట్టుకోకూడదు.

ఆలోచనలు రాకుండా ఉండాలంటే కొన్ని చిన్న మార్పులు చేసుకోవాలి. పూజకు కూర్చునే ముందు ఐదు నిమిషాల పాటు ప్రశాంతంగా శ్వాసపై ధ్యాసం పెడితే మనసు కుదుటపడుతుంది. మంత్రాలను గట్టిగా ఉచ్చరించడం లేదా పాటల రూపంలో పాడటం వల్ల శబ్ద తరంగాలు మనసును బయట ప్రపంచం నుండి వేరు చేస్తాయి.
అలాగే, పూజ గదిలో సుగంధ పరిమళాలు, దీపపు కాంతి వంటివి ఏకాగ్రతను పెంచడానికి సహకరిస్తాయి. మనసు ఎక్కడికో వెళ్తోందని గ్రహించిన మరుక్షణమే, ఏమాత్రం నిరాశ చెందకుండా మళ్లీ దేవుడి రూపంపై దృష్టి పెట్టాలి.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం ఆధ్యాత్మిక గ్రంథాల సారాంశం మరియు పెద్దల మాటల ఆధారంగా రూపొందించబడింది. ఇది కేవలం మీ మానసిక ప్రశాంతత కోసం ఉద్దేశించినది. భక్తి మార్గంలో సందేహాలు ఉంటే మీ గురువులను లేదా పండితులను సంప్రదించి మరింత లోతైన అవగాహన పొందవచ్చు.
