తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ గట్టిగా కష్టపడుతుంది..ఒక సీటు నుంచి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కదుపుతుంది. 2018 ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకున్న విషయం తెలిసిందే..ఆ తర్వాత బీజేపీ బలం పుంజుకుంటూ..రెండు ఉపఎన్నికల్లో గెలిచింది. అటు నాలుగు ఎంపీ సీట్లు బీజేపీ చేతులో ఉన్నాయి. జిహెచ్‌ఎంసి లో బలం ఉంది. ఇక ఓవరాల్ గా రాష్ట్రంలో బలం పుంజుకుని..నెక్స్ట్ ఎన్నికల్లో కేసీఆర్‌ని గద్దె దించి అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తుంది. ఆ దిశగానే పనిచేస్తుంది.
అన్నీ జిల్లాల్లోనూ బలపడటమే లక్ష్యంగా బీజేపీ ముందుకెళుతుంది. అయితే అన్నీ జిల్లాల్లో బీజేపీ బలం పెరగడం లేదు. హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ లాంటి జిల్లాల్లో కాస్త బలం ఎక్కువ కనిపిస్తోంది తప్ప..మిగిలిన జిల్లాల్లో అంతగా బలపడినట్లు కనిపించడం లేదు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్ లాంటి జిల్లాల్లో కాస్త బలం పెంచుకుంది. వరంగల్, నల్గొండ, ఖమ్మం లాంటి జిల్లాలో అసలు బలం లేదు. అయితే ఇటీవల వరంగల్, నల్గొండ జిల్లాల్లో బలమైన నాయకులని బీజేపీలోకి తీసుకొస్తున్నారు.
ఇదే క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడంతో నల్గొండలో బీజేపీ పాగా వేయడానికి ఛాన్స్ దొరికింది. మునుగోడు ఉపఎన్నికలో గెలిస్తే నల్గొండలో బీజేపీలో చేరికలు పెరుగుతాయి..ఆ పార్టీకి బలం పెరుగుతుంది. కానీ అన్నీ జిల్లాలు ఒక ఎత్తు..ఖమ్మం జిల్లా ఒక ఎత్తు అన్నట్లు ఉంది. ఇక్కడ అసలు బీజేపీకి ఏ మాత్రం బలం లేదు. మొదట నుంచి ఇక్కడ బీజేపీ సత్తా చాటిన సందర్భాలు లేవు.
ఇప్పటికీ జిల్లాలో బలమైన నాయకులు లేరు. ఏదో చెప్పుకోవడానికి పొంగులేటి సుధాకర్ రెడ్డి ఒకరే ఉన్నారు. కాబట్టి ఈ జిల్లాపై బీజేపీ ఎక్కువ ఫోకస్ పెట్టాలి. కాంగ్రెస్ బలంగా ఉన్న ఈ జిల్లాలో బలమైన నాయకులని బీజేపీలోకి తీసుకురావాలి. అయితే ప్రస్తుతానికి బీజేపీ..ఖమ్మంపై పెద్దగా ఫోకస్ చేసినట్లు కనిపించడం లేదు. మునుగోడు తర్వాత ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది. జిల్లాలో బలమైన నాయకులని లాగితే కమలం పార్టీ బలపడుతుంది.