ప్రస్తుతం ఎక్కడ చూసినా కోడింగ్ నేర్చుకోండి, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలను అలవాటు చేసుకోండి.. అంటూ యాప్‌లు ఊదరగొట్టేలా ప్రచారం ఇస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ కోడింగ్ నేర్చుకుని సొంతంగా యాప్‌లను క్రియేట్ చేయండి.. అంటూ యాడ్స్ ఇస్తున్నారు. అయితే నిజానికి కోడింగ్ అనేది ఎప్పుడో గ్రాడ్యుయేషన్‌లో చేరాక నేర్చుకోవాల్సిన సబ్జెక్టు. చాలా కఠినంగా ఉంటుంది. అనేక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లను నేర్చుకుని వాటిపై పట్టు సాధిస్తేగానీ కోడింగ్ మీద గ్రిప్ రాదు. అలాంటిది చిన్న పిల్లలకు అలాంటి కఠినమైన కోడింగ్ పాఠాలు ఇప్పుడే ఎందుకు ? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే పిల్లలకు ఆ వయస్సులో కోడింగ్ పాఠాలు అవసరమా ? కాదా ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా ఎవరైనా సరే ఎదుగుతున్నకొద్దీ వారిలో మెదడు వికసిస్తుంది. జ్ఞాన సముపార్జన ఎక్కువగా చేస్తారు. ఎదిగే వయస్సులో నేర్చుకునేది జీవితాంతం గుర్తుంటుంది. ఎంత ఎక్కువ జ్ఞానం సంపాదిస్తే భవిష్యత్తు అంత బాగుంటుంది. అందుకనే పునాది స్ట్రాంగ్‌గా ఉండాలని చెప్పి తల్లిదండ్రులు తమ పిల్లలను మంచి మంచి కార్పొరేట్ స్కూళ్లలో చేర్పిస్తుంటారు. అయితే పిల్లలకు ఆ వయస్సులో ప్రోగ్రామింగ్ భాషలు, వాటి స్కిల్స్, కోడింగ్ పాఠాలు చెప్పడం వల్ల సహజంగానే వారిలో మ్యాథ్స్ పట్ల ఉండే భయం పోతుంది. ఎందుకంటే కోడింగ్‌లో మ్యాథ్స్, అల్గారిథం, లాజికల్ థింకింగ్ వంటివి చాలా కీలకం. ఈ క్రమంలో కోడింగ్ నేర్చుకుంటే వారు గణితం అంటే ఉండే భయాన్ని విడిచిపెడతారు.
ఇక పిల్లలు కోడింగ్ నేర్చుకోవడం వల్ల వారిలో సృజనాత్మకత, ఆలోచించే శక్తి పెరుగుతుంది. కొత్తగా ఏదైనా చేయాలనే తపన కలుగుతుంది. టెక్నాలజీని మరింత బాగా ఉపయోగించుకుంటారు. యుక్త వయస్సుకు వచ్చే సరికి ఇంకా ఎక్కువ ప్రావీణ్యతను సంపాదిస్తారు. దాంతో కెరీర్ పరంగా చక్కని అవకాశాలను పొందవచ్చు. లేదా సొంతంగా స్టార్టప్ ప్రారంభించేందుకు కావల్సినంత జ్ఞానం, నైపుణ్యాలు అలవడుతాయి. అందువల్లే పిల్లలకు కోడింగ్ పాఠాలు చెప్పాలని నిపుణులు కూడా సూచిస్తున్నారు.
అయితే పిల్లలకు ఆ వయస్సులో కోడింగ్ నేర్చుకోవడం కత్తి మీద సాము వంటిది. అందువల్ల వారికి నిజంగా ఆసక్తి ఉంటేనే వారికి ఆ పాఠాలు నేర్పించాలి. లేదంటే తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా వృథాయే అవుతుంది. వారికి వారు స్వతహాగా ఆసక్తితో కోడింగ్ పాఠాలు నేర్చుకుంటేనే భవిష్యత్తులో వారి కెరీర్ బాగుంటుంది. అందువల్ల ఆ పాఠాలు నేర్చుకోవాలా, వద్దా అనేది వారి నిర్ణయానికే విడిచి పెట్టడం మంచిది. కాకపోతే ముందుగా అలవాటు చేసి చూడాలి. తరువాత వారి నేర్చుకునే శక్తిని బట్టి నిర్ణయం తీసుకోవడం మంచిది.