తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారనే అంశంపై ఎప్పటినుంచో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొందరు నేతలు..అదే పార్టీలో అంతర్గత విభేదాలు పెరిగేలా చేసి..కేసిఆర్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వచ్చాయి. ఇక కొందరు నేతలు ప్రగతి భవన్‌కు వెళ్ళి కేసిఆర్ ఇచ్చే జీతం తీసుకుని పనిచేస్తారనే ఆరోపణలు వచ్చాయి. ఇలా కాంగ్రెస్ పార్టీలో కోవర్టుల రచ్చ నడుస్తోంది.
ఈ మధ్య కొందరు సీనియర్లని టార్గెట్ చేసుకుని కోవర్టులు అనే ముద్రవేస్తున్నారని చెప్పి సీనియర్ నేత దామోదర రాజనర్సింహా ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇదంతా రేవంత్ వర్గం పని అని చెప్పి దామోదర ఫైర్ అయ్యారు. అయినా కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారనే విషయం హాట్ టాపిక్ గానే ఉంది. తాజాగా పాదయాత్రతో ప్రజల మధ్యలో తిరుగుతున్న రేవంత్ రెడ్డి.. కోవర్టులని ఏరిపారేస్తానని మాట్లాడారు.
అయితే పార్టీలోని పదవుల విషయంతో పాటు పార్టీ లైన్‌ను దాటే సీనియర్ల తీరుపై రేవంత్ సీరియస్ అవుతున్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే సీనియర్ నేతలపై అధిష్టానానికి ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తూ.. పార్టీ కోసం పనిచేసే నేతలకు పదవుల్లో అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.అయితే ఇప్పటికే తమని రేవంత్ పక్కన పెడుతున్నారనే అసంతృప్తి సీనియర్లలో ఉంది. ఇప్పుడు తాజాగా సీనియర్లని లక్ష్యంగా చేసుకునే కోవర్టులని పక్కన పెడతానని అంటున్నారనే చర్చ నడుస్తోంది.
అయితే ఎంత కాదు అనుకున్న కాంగ్రెస్ పార్టీలో కేసిఆర్‌కు అనుకూలంగా పనిచేసేవారు ఉన్నారనే విషయంలో వాస్తవాలు ఉన్నాయని అంటున్నారు. కేసిఆర్‌కు అనుకూలంగా పనిచేస్తూ..కాంగ్రెస్ లో చిచ్చు పెట్టి, ఇంకా పార్టీని దెబ్బతీయడానికి ఆ నేతలు పనిచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అలాంటి వారిపై రేవంత్ గట్టిగా ఫోకస్ చేసినట్లు కనిపిస్తున్నారు. మరి చూడాలి రానున్న రోజుల్లో రేవంత్ ఎవరిని సైడ్ చేస్తారో.