అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వస్తున్నారు అనగానే దేశంలో ఎంతో ఆసక్తికర వాతావరణం నెలకొంది. సాధారణంగా అమెరికా నుంచి అక్కడి మంత్రులు గాని, ఇతర ప్రతినిధులు గాని ఎవరు వచ్చినా సరే ఆసక్తి ఉంటుంది. వాళ్ళు వచ్చిన దగ్గరి నుంచి భద్రత సహా అనేక అంశాల్లో ప్రజలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా అసలు ఇరు దేశాల మధ్య జరిగే కీలక ఒప్పందాలపైనే అందరి దృష్టి ఉంటుంది.
ఇక ఇప్పుడు ట్రంప్ భారత పర్యటనకు వస్తున్న నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, ట్రంప్ ఏ ఏ అంశాల మీద సంతకాలు చేస్తారు అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. ట్రంప్, మోడీ భేటీ కి సంబంధించి ఇప్పటికే 5 ఎంవోయూలను సిద్దం చేసారు అధికారులు. ఇది పక్కన పెడితే ఆఫ్ఘనిస్తాన్ లో భారత బలగాల మోహరింపు కి సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉంది. తూర్పు ఆసియా, పసిఫిక్ దేశాల్లో చైనా తర్వాత రెండో పెద్దన్నగా భారత్ ఉంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయుల మద్దతు కూడగట్టేందుకూ, వాణిజ్య పరంగా ఈ భేటీ చాలా కీలకం కానుంది. ప్రస్తుతం రెండు దేశాల మధ్యా ఏటా 12000 కోట్ల డాలర్ల బిజినెస్ జరుగుతోంది. దీన్ని 50000 కోట్లకు చేర్చాలన్నది ఇరు దేశాల మధ్య కీలకంగా జరుగుతున్న చర్చ. ఇక ఆయుధాలతో పాటుగా ఇజ్రాయిల్ తో భారత సంబంధాలపై కూడా ట్రంప్ చర్చలు జరిపే అవకాశం ఉంది. ఇజ్రాయిల్ అమెరికా తర్వాత అత్యంత శక్తివంతమైన దేశం.
అదే విధంగా ఇరాన్ సహా మధ్య గల్ఫ్ దేశాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ట్రంప్ కి భారత్ లో వ్యక్తిగతంగా పెట్టుబడులు ఉన్నాయి. బెంగళూరు, ముంబై నగరాల్లో ఆయన పెట్టుబడులు ఆరు వేల కోట్ల వరకు ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా భారత్ కి ప్రతిష్టాత్మక అంశంగా ఉన్న కాశ్మీర్ విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారు అనేది చూడాల్సి ఉంది.