అమెరికా అధ్యక్ష పీఠానికి జరిగిన ఎన్నికలు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిని రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు జరుగుతున్న కౌంటింగ్‌లోనూ అంతే ఉత్కంఠ, ఆసక్తి నెలకొన్నాయి. మొత్తంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చిన్న చితకా పార్టీలు కూడా పోటీలో ఉన్నప్పటికీ.. ప్రధానంగా డొనాల్డ్ ట్రంప్.. జో బైడెన్‌ల మధ్య తీవ్ర పోరు సాగుతోంది. ఈ క్రమంలో ఎవరికి వారు ధీమాగా ఉన్నారు.
మాదంటే గెలుపు మాదేనని ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్, డెమొక్రాట్ల తరఫున బరిలో నిలిచిన.. బైడెన్‌లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఎన్నికల ఫలితాల్లో.. ఇద్దరికీ టఫ్ ఫైట్ ఉంటుందని అంచనా వేసుకు న్నట్టే తాజా పరిస్థితి కొనసాగుతోంది. అదేసమయంలో ట్రంప్ ముందుగానే ఊహించినట్టు.. ఎన్నికల్లో తేడా వస్తే… సుప్రీం కోర్టుకు వెళ్తానని చెప్పారు. ఇక. ఇప్పుడు అదే చేస్తున్నారు. ఎన్నికల ఓట్లు లెక్కింపు ప్రారంభమైన తర్వాత. తనకు తేడా కొడుతున్నట్టు గ్రహించిన ట్రంప్.. ఆదిశగానే అడుగులు వేస్తున్నారు.
‘ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ అక్రమాలకు పాల్పడ్డారు. నేను సుప్రీం కోర్టుకు వెళ్తున్నా.. ఎన్నికల కౌంటింగ్‌ను వెంటనే ఆపేయాలి.. ఈ ఎన్నికలను మేమే గెలవబోతున్నాం.. నిజంగా చెబుతున్నా.. మేమే గెలిచాం.. చట్టాన్ని సరిగ్గా ఉపయోగించి ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలను ఆపేయాలని కోరుతున్నాం..’ అంటూ ట్రంప్ కామెంట్స్ చేశారు. మరీ ముఖ్యంగా పెన్సిల్వేనియా రాష్ట్రంలో తనకు అనుకూల ఓటు బ్యాంకు ఉందని ట్రంప్ చెబుతున్నారు.
అయితే, ఇప్పుడు బైడెన్ దూకుడుగా ఉండడం.. ఎక్కువ మెజారిటీతో కొనసాగుతున్న నేపథ్యంలో .. ట్రంప్ పార్టీ రిపబ్లికన్స్.. కోర్టుల్లో కేసులు వేశారు. దీంతో ఇవి విచారణకు వచ్చే సరికి సమయం పడుతుందని అంటున్నారు. మొత్తంగా చూస్తే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదని ఎన్నికల పరిశీలకులు చెబుతున్నారు.