ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీల హవాకు కళ్లెం వేసేందుకు కాషాయ దళం చురుకుగా పావులు
పుతోంది. కొంత కాలం రాయలసీమలో రాజకీయం చేసింది. ఆ తర్వాత అమరావతికి షిఫ్ట్ అయింది. అధ్యక్షులైతే మారారు కానీ అదృష్టం మాత్రం కలిసిరాలేదు. దీంతో ఇప్పుడు తూర్పు సెంటిమెంట్ ను నమ్ముకుంది. తాజాలకు.,మాజీలకు వల విసురుతోంది. సంస్థాగతంగా బలోపేతం అవుతూనే….పార్టీలో చేరికలపైన ఫోకస్ పెట్టింది.
తెలుగుదేశం పార్టీలో కీలక నాయకులు, అసంతృప్తును ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. అదే సమయంలో వైసీపీ లో వివిధ కారణాలతో ఇమడలేక తటస్థ వైఖరిని అవలంభిస్తున్న వారిని సంప్రదిస్తోంది. మండల, జిల్లా,రాష్ట్ర స్థాయిలో సీనియర్ల ను స్వాగటిస్తోంది. ఇక, టీడీపీని వద్దనుకున్న వాళ్ళు వైసీపీలో అవకాశం కోసం ఎదురు చూస్తున్న తటస్థులను తమ వైపు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. పార్టీల్లో చేరికలపై సోము వీర్రాజు బహిరంగ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.
సోము కామెంట్స్ తో వ్యవహారం మాజీ మంత్రి గంటా వైపు మళ్లింది. ఆయన కొంత కాలంగా టీడీపీకి పూర్తిగా దూరమయ్యారు. రాజకీయంగా తెచ్చి పెట్టుకున్న తటస్థ వైఖరిని ఎంచుకున్నారు. వైసీపీలో చేరికపై ప్రచారాలు జరిగినా అది కార్య రూపం దాల్చలేదు. అలాంటి నేపథ్యంలో సోము చెప్పిన గంటా….ఈ గంటా ఒక్కటేనా….లేక వేరే ఏదైనా ఉందా అనేది ఆసక్తికరమైన చర్చ రాజకీయ వర్గాలో నడుస్తుంది.సోము రాష్ట్ర అధ్యక్షుడు కాక ముందు గంటా ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ మీట్ జరిగింది. అప్పట్లో రాజకీయంగా ఈ అంశం చర్చకు దారితీసింది. ఐతే, ఆ సమావేశానికి ఎటువంటి ప్రాధాన్యత లేదని ఇరువురు నేతలు ప్రకటించారు. అప్పటి నుంచి గంటా పార్టీ మారడం ఖాయమని….అది వైసీపీనా, బీజేపీనా తేల్చుకోలేకపోతున్నారనే ప్రచారం జరిగింది.
ఉత్తరాంధ్రలో మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు ఇప్పటికే బీజేపీ తీర్థం తీసుకోగా….నియోజకవర్గాల స్థాయి నాయకుల జాయినింగ్స్ విషయంలోనూ హడావిడి మొదలయింది. ఈ కార్యక్రమాలకు జాతీయ స్థాయి నాయకులను ఆహ్వానించడం ద్వారా పార్టీలో చేరుతున్న వారు రాజకీయంగా తమకు అత్యంత అవసరం అయిన వారుగా ముద్ర వేయడం కారణంగా కనిపిస్తుంది. త్వరలోనే మరిన్ని చేరికలు ఉంటాయని. ఏపీ లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామనే సంకేతాలు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజధాని నేపథ్యంలో ఉత్తరాంధ్రపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. రాష్ట్ర కార్యవర్గం, అనుబంధ సంఘాలను పటిష్టం చేయడమే కాదు అందులో ప్రాధాన్యతను శ్రీకాకుళం, విశాఖ, విజయంనగరం జిల్లాలకు ఇచ్చింది. కోవిడ్ తర్వాత తొలిసారి వందల మందితో విశాఖ వేదికగా భారీ కార్యక్రమం నిర్వహించింది. యువమోర్చా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం కోసం చేసిన హాంగామా….ఒక విధంగా ఉత్తరాంధ్ర బీజేపీలో కొత్త ట్రెండ్. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో బీజేపీ భాగస్వామ్యంపై విస్త్రతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది ప్రధాన ఆలోచన.అదే సమయంలో టీడీపీని మరింత బలహీనపరచడం,వైసీపీలో అసంతృప్తులను ఆహ్వానించడం లక్ష్యంగా అడుగులు వేస్తోంది.