ఇళయరాజాకు ‘యువన్’ కౌంటర్.. మోదీని పొగడటాన్ని ఇష్టంలేకనేనా..?!

-

ఇళయరాజా.. ఆయన సంగీతానికి మైమరచి పోనివారు ఎవరూ ఉండరు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ, మరాఠీ భాషల్లో దాదాపు వెయ్యి గీతాలకు సంగీతం అందించారు. ‘సంగీతం’ అనే ల్యాబ్ లో జీవితాన్ని అంకితం చేస్తే తప్ప అంతటి మంచి సంగీతం పుట్టదని అంటారు అభిమానులు. అలాంటి ‘మేస్ట్రో’, ‘ఇసైజ్ఞాని’ ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. ఒక పుస్తకానికి ఆయన రాసిన ముందుమాటే ఇందుకు కారణం. ప్రధాని నరేంద్ర మోదీని, బాబాసాహెబ్ అంబేద్కర్ తో పోలుస్తూ ఆయన రాసిన ముందుమాట తీవ్ర చర్చనీయాంశమైంది. బ్లూక్రాఫ్ట్ పబ్లికేషన్స్ ప్రచురించిన ఇంగ్లిష్ పుస్తకం ‘అంబేడ్కర్ అండ్ మోదీ- రిఫార్మర్స్ ఐడియాస్ పర్ఫార్మర్స్ ఇంప్లిమెంటేషన్’‌కు రాసిన ముందుమాటలో.. ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. తాను కూడా దళితుడినేనని పేర్కొంటూ అంబేద్కర్ ఆశయాలను మోదీ నెరవేరుస్తున్నారని అన్నారు.

‘‘భారత రాజ్యాంగం ద్వారా మనకు హక్కులు కల్పించడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన గొప్ప కృషి గురించి మనందరికీ తెలుసు. అంబేద్కర్ అరుదైన నాయకుడు. ఆయన జీవించి ఉన్నప్పుడే చరిత్ర సృష్టించారు. మరణించి దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ ప్రజలు ఇంకా ఆయనను విస్తృతంగా అనుసరిస్తున్నారు, ఆయన గురించి చదువుతున్నారు. కొన్నేళ్ల క్రితం ప్రధాని మోదీ, భారతదేశ నదీ జలాల విధాన రూపశిల్పి డాక్టర్ బీఆర్ ఆంబేద్కర్ అని వ్యాఖ్యనించడం వార్తల్లో చదివాను. నీరు, సాగుకు సంబంధించిన కొన్ని కీలక సంస్థల ఏర్పాటులో అంబేద్కర్ పాత్ర గురించి తెలుసుకొని నేను ఆశ్చర్యపోయాను. 2016లో ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ సందర్భంగా మోదీ ప్రసంగం ద్వారా ఈ విషయాలను తెలుసుకోవడం చాలా అద్భుతంగా అనిపించింది’’ అని రాశారు. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగపర రక్షణలను ఏర్పాటు చేయడం ద్వారా వెనుకబడిన వర్గాలకు చట్టపరమైన రక్షణ ఏర్పడిందని పేర్కొన్నారు.

అయితే.. మహనీయుడైన అంబేద్కర్‌తో ప్రధాని మోదీని పోల్చడమేమిటంటూ తమిళనాడుతోపాటు సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. అంబేద్కర్ ఎక్కడ? మోదీ ఎక్కడ? అంటూ నిలదీస్తున్నారు. ఆయనపై ఓ స్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది. ఇక తమిళనాడులో అయితే రాజకీయపక్షాలన్నీ ఇళయరాజాను దుమ్మెత్తి పోస్తున్నాయి. ఏదోపదవి ఆశించే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్నాయి. అయితే.. ఈ విమర్శకుల జాబితాలో ఇళయరాజా కుమారుడు యువన్ శంకర్ రాజా కూడా చేరినట్లు కనిపిస్తోంది. తన తండ్రి ప్రధాని మోదీని పొగిడిన రెండు రోజులకే ఇన్‌స్టా గ్రామ్‌లో ఆయన ఓ ఫొటో షేర్ చేశారు. ‘‘నల్ల ద్రావిడుడు, గర్వకారణమైన తమిళుడు ( డార్క్ ద్రవిడియన్, ప్రౌడ్ తమిళన్)’’ అనే కామెంట్‌తో సముద్రం ఒడ్డున నలుపు రంగు టీషర్టు ధరించి ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. ఈ సమయంలో ఇలాంటి పోస్ట్ చేయడం అంటే తన తండ్రి ఇళయరాజా తీరుకు నిరసనగా ఈ పోస్టు పెట్టి ఉంటారని జోరుగా చర్చ సాగుతోంది.ఇళయరాజాకు కుమారుడి కౌంటర్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫొటోపై తమిళనాడు బీజేపీ నేతలు కూడా తీవ్ర స్థాయిలో ఎదురుదాడికి దిగుతున్నారు. ఆఫ్రికన్లు అందరూ నల్లగానే ఉంటారు. వారు కూడా ద్రావిడులేనా? అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇళ‌య‌రాజాకు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version