తెలంగాణ టూరిజం శాఖ బ్రాండ్ అంబాసిడర్ గా బిగ్ బాస్ దేత్తడి హారిక నియామకం వివాదాస్పదమవుతోంది. ముందుగా మహిళా దినోత్సవం రోజున టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అయిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా హారిక ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తూ ప్రకటన చేశారు. అయితే ఈ అంశం మీద అ సీఎంవో అధికారులు సీరియస్ అయ్యారని, ఆమె నియామకానికి సంబంధించిన వివరాలు అన్నీ టూరిజం శాఖ వెబ్ సైట్ నుంచి తొలగించారని మీడియాలో ప్రచారం జరిగింది. కొద్దిసేపటికి ఉప్పల శ్రీనివాస్ గుప్తా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అదంతా దుష్ప్రచారమని ఇప్పటికీ హారిక అంబాసిడర్ గా కొనసాగుతున్నారని ఎవరో గిట్టని వాళ్లు ఇలా ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
అయితే ఈ వివాదం సమసిపోతుంది అని భావిస్తున్న నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ సంచలనం రేపుతున్నాయి. అసలు దేత్తడి హారిక అంటే ఎవరో తనకు తెలియదని ప్రస్తుతం తాను ఎన్నికల హడావిడి లో ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు. సాధారణంగా ఇలా అంబాసిడర్ అంటే సెలబ్రిటీలని పెడతామని అసలు ఈ నియామకం గురించి తనకు తెలియదని ఆయన చెప్పుకొచ్చారు. ఇక సీఎంకు సమాచారం ఇవ్వకుండా నియామకం చేసిన వ్యవహారం మీద చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు.