తెలంగాణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ప్రచారంలో స్పీడ్ పెంచింది. ఆ పార్టీ నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే.. తాజాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మళ్లీ ఎగిరేది బీఆర్‌ఎస్ జెండానేనని.. 12 అసెంబ్లీ స్థానాలకు 12 పార్టీ సొంతం చేసుకుంటుందని విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని శాలి గౌరారం మండలం అడ్లూర్‌లో ఎమ్మెల్యే అభ్యర్థి గాదరి కిశోర్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కక్ష్య కార్పణ్యాలకు నిలయమైన తుంగతుర్తిలో ప్రశాంత వాతావరణం నెలకొల్పిన ఘనత కిశోర్‌దేనన్నారు. దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని ఇక్కడి ప్రజలు కిషోర్ నాయకత్వంలో అద్భుత ప్రగతిని తుంగతుర్తి చూస్తున్నారని అన్నారు. స్వలాభం కోసం గ్రామాల్లో రక్తం పారిచిన చరిత్ర గత పాలకులదేనన్నారు. గత పాలనలో గ్రామాల నుంచి పట్టణాలకు వస్తే అది కేవలం రాజకీయ కేసుల గురించినే ఉండేదన్నారు. బీఎన్‌రెడ్డి కలలను నిజం చేసింది బీఆర్‌ఎస్ పార్టీ అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో 2లక్షల ఎకరాలను ససశ్యామలం చేసిన ఘనత బీఆర్ఎస్‌దేనన్నారు. కిశోర్‌ను మూడోసారి గెలిపించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు.
మరోవైపు ఉమ్మడి నల్గొండ బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారాన్ని ప్రజలు సమస్యలు చెప్పుకునేందుకే ఉపయోగించుకుంటున్నారన్నారు. ప్రభుత్వం కొనసాగుతుందనే భావనతోనే ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు ఉన్నారన్న మంత్రి, మరోసారి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 బీఆర్ఎస్ గెలవడం ఖాయమన్నారు. అభ్యర్థులపై ప్రజలు చూపిస్తున్న ఆధారాభిమనాలే బీఆర్ఎస్‌పై ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. వ్యవసాయ రంగంలో కేసీఆర్ తీసుకొచ్చిన అనేక చర్యలు జిల్లాలో వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడిందన్నారు.