తెలంగాణలో కాంగ్రెస్ సునామీ ఉంది : భట్టి

-

తెలంగాణలో కాంగ్రెస్‌ స్పీడ్‌ పెంచింది. అయితే.. ప్రజల్లోనూ కాంగ్రెస్‌కు అనుకూల పవనాలు వీస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ 78 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేత, మధిర అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం మధిర పట్టణంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో కాంగ్రెస్ సునామీ ఉందన్నారు. మరో నెల రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. ఆ ప్రభుత్వ ఏర్పాటులో మధిర దశాదిశ నిర్దేశించేదిగా ఉండాలన్నారు. అందుకే తనను నాలుగోసారి ఎమ్మెల్యేగా దీవించాలన్నారు. ప్రజల సంపదను వారికే పంచాలని తాము ఆరు గ్యారెంటీలను తీసుకు వచ్చామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆ హామీలను అమలు చేస్తామన్నారు.

మధిరలో చెరువులను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతానని, మత్స్య అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మధిరను ఫాస్ట్ గ్రోయింగ్ నగరంగా మారుస్తానన్నారు. నగర అభివృద్ధి కోసం వచ్చే అయిదేళ్లు పని చేస్తానన్నారు. మధిరకు ఔటర్ రింగ్ రోడ్డు కోసం మాస్టర్ ప్రణాళికను రూపొందించినట్లు చెప్పారు. సుందరమైన పట్టణంగా అభివృద్ధి చేస్తామన్నారు. పత్తి, మిర్చి, పసుపు, వరి ఇతర వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు తీసుకు వచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు కృషి చేస్తానన్నారు. మధిర ప్రజలు, ఓటర్ల వల్లే తాను సీఎల్పీ లీడర్ అయ్యానని, తనను మూడుసార్లు గెలిపించిన ప్రజల గౌరవాన్ని పెంచానే తప్ప తగ్గించలేదన్నారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం రావాలని అదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేశానన్నారు. తనకు ఓటు వేసి గెలిపించిన మధిర ప్రజలు తలదించుకునేలా తాను ఎప్పుడూ చిల్లర రాజకీయాలు చేయలేదన్నారు. చట్టసభలో ప్రతిపక్ష సభ్యుడిగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించానన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version