నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ పై అదే సామాజిక వర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డితో చంద్రబాబు తిట్టి పోయించారు. ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి చంద్రబాబుపై అంతకు డబల్ తిట్ల బదులు తీర్చుకుంటున్నట్లు అర్థమవుతోంది. చంద్రబాబు సామాజిక వర్గానికే చెందిన కొడాలినాని చేత పరుషపదజాలంతో మాట్లాడిస్తున్నారు. వంశీ టీడీపీకి గుడ్‌బై చెప్పడం..దేవినేని అవినాష్ వైసీపీలో చేరికతో టీడీపీకి ఆ మధ్య వరుస షాక్‌లు తగిలాయి.
ఆ షాక్‌ల నుంచి ఇప్పుడిప్పుడే అక్కడ పరిస్థితులు కుదుటపడుతున్నా…కొడాలి నాని చంద్రబాబుపై చేసిన పరుష పదజాలం వ్యాఖ్యల మంటలు మాత్రం ఇప్పట్లో చల్లారేలా కనబడటం లేదట.అధినేతను మరి అంతలా దూషించేలా నానికి అవసరం ఉండకపోవచ్చని..కేవలం జగన్ సూచన మేరకే ఈ విధంగా చేసి ఉండవచ్చన్న వాదన టీడీపీ, వైసీపీ వర్గాల్లో వ్యక్తమవుతుండటం గమనార్హం. అయితే నాని తిట్ల దండకాన్ని కొంతమంది వైసీపీ నేతలు సమర్థించుకుంటున్నారు.
నాడు జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ సొంత జిల్లా, సొంత సామాజికవర్గానికి చెందిన ఆదినారాయణరెడ్డి చేత బూతులు మాట్లాడిన చంద్రబాబు చరిత్రను ఇంకా తెలుగు ప్రజలు మరిచిపోలేదని గుర్తు చేస్తున్నారు. నాడు ఆదినారాయణ గతంలో వైసీపీలో ఉండేవారు… ఆయన్ను పార్టీలో చేర్చుకున్న బాబు మంత్రి పదవి ఎరవేసి.. జగన్‌ను విపరీతంగా తిట్టించారు.
ఇక ఇప్పుడు వైసీపీ వాళ్లు నాటి సంఘటనలను గుర్తు చేస్తూ ఇప్పుడు నిజాలనే నాని కాస్త కరుకుగా ఆవేశంతో మాట్లాడుతున్నారని ఆయన్ను వెనకేసుకు వస్తుండటం విశేషం.
నాడు వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికై టీడీపీలో చేరిన ఆదినారాయణరెడ్డికి చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారని, దానికి కృతజ్ఞతగా రోజూ జగన్ను తిట్టాలని సూచించినట్లు వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. నాడు బాబు చేసినట్టుగానే నేడు జగన్ చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన కొడాలి నానితో ఆ పనికానిస్తున్నారని చెబుతున్నారు. అయితే నాడు ఆది…జగన్‌ను వ్యక్తిగతంగా విమర్శించలేదు. పార్టీ పరంగా, సిద్దాంత పరంగానే విమర్శించారని , నేడు కొడాలి మాత్రం అవేమీ పట్టించుకోకుండా చంద్రబాబును, ఆయన కుమారుడిని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారంటూ టీడీపీ వర్గాలు వాపోతున్నాయి.