ఉత్తరాంధ్ర” తెలుగుదేశం పార్టీకి ముందు నుంచి అండగా ఉన్న ప్రాంతం. రాజకీయంగా ఈ ప్రాంతం తెలుగుదేశం పార్టీకి ఎన్నో విజయాలను అందించింది. కాంగ్రెస్ బలంగా ఉన్న సమయంలో కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీని దాటి రాజకీయం చేయడంలో ఫెయిల్ అయింది. టీడీపీకి మద్దతు ఇచ్చే సామాజిక వర్గాలు ఎక్కువగా ఉండటం, రెడ్డి సామాజిక వర్గం తక్కువగా ఉండటంతో తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చిన అంశం. బలమైన నేతలు ఈ ప్రాంతం నుంచి టీడీపీకి దొరికారు అనేది వాస్తవం.
అశోక గజపతి రాజు, ఎర్రన్నాయుడు, అచ్చేన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు వంటి నేతలు ఇక్కడ పార్టీకి అండగా ఉన్నారు. వీరిలో ఒక్క ఎర్రన్నాయుడు మాత్రమే ఇప్పుడు లేరు. మొన్నటి ఎన్నికల్లో కూడా విశాఖలో నాలుగు ఎమ్మెల్యే, శ్రీకాకుళం ఎంపీ స్థానాన్ని తెలుగుదేశం గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రాజధాని మీద జగన్ చేసిన ప్రకటన తో తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. ఉత్తరాంధ్ర కు కమిటి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది.
దీనితో ఉత్తరాంధ్ర లో తెలుగుదేశం పార్టీని కోలుకోలేని దెబ్బ కొట్టారు జగన్. గంటా శ్రీనివాసరావు, కొండ్రు మురళి వంటి నేతలు ఇప్పటికే జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు. వీళ్ళు పార్టీ మారినా సరే ఆశ్చర్యం లేదు. జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించే స్థితిలో కూడా అక్కడ పార్టీ నేతలు దాదాపుగా లేరనే చెప్పాలి. దీనితో పార్టీకి ఊహించని దెబ్బలు భవిష్యత్తులో తగిలే అవకాశం ఉందనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. విశాఖలో ఇప్పటికే కమిటి నివేదికపై అక్కడి ప్రజలు పండగ చేసుకుంటున్న సంగతి తెలిసిందే.