రాజకీయాల్లో వ్యూహాలు మారుతున్నాయి. ఏపీలో మరీ ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ తన వ్యూహానికి మరింత పదును పెంచుతోంది. ఈ క్రమంలో టీడీపీకి అండగా ఉంటున్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు సామాజిక వర్గంపై పెద్ద ఎత్తున దెబ్బకొట్టేలా జగన్ ప్రయత్నిస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. టీడీపీని అన్ని విధాలా దెబ్బకొట్టాలనేది వైసీపీ నిర్ణయం. ఈ క్రమంలో రాజకీయంగా వేస్తున్న అడుగులు తెలిసిందే. టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకొంది వైసీపీ. అదే సమయంలో ఆ పార్టీలో ఓడిపోయిన వారిని కూడా తన వైపునకు తిప్పుకొంది.
అంతేకాదు.. యువ నేతలు టీడీపీకి అండగా ఉంటారని భావించిన చంద్రబాబుకు ఆ విషయంలోనూ జగన్ దెబ్బేస్తున్నారు. టీడీపీ యువ నేతలను కూడా వైసీపీ వైపు తిప్పుకొంటున్నారు. ఇలా.. రాజకీయంగా పార్టీని వచ్చే ఎన్నికలనాటికి తీవ్రస్థాయిలో దెబ్బేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఇది ఒక్కటే అయితే.. జగన్ ఎందుకు అవుతారు? ఇప్పుడు సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. టీడీపీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉన్న కమ్మ సామాజిక వర్గంపై ఆర్థికంగా దెబ్బేసేందుకు జగన్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.
చంద్రబాబుకు కమ్మ సామాజిక వర్గానికిచెందిన విద్యాసంస్థల అధినేతలు అండగా ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో మెజారిటీ విద్యాసంస్థలు కమ్మ వర్గం చేతిలోనే ఉన్నారు. వీరంతా కూడా బాబుకు అండగా ఉన్నారు. అదేసమయంలో వైద్య రంగంలోనూ కార్పొరేట్ వైద్య శాలలు నిర్వహిస్తున్న వారు కూడా కమ్మ వర్గానికి చెందిన వారే. వీరు రాజకీయంగా ప్రత్యక్షంగా ఎక్కడా కనిపించరు. కానీ, పరోక్షంగా టీడీపీకి అన్ని విధాలా అండగా ఉంటున్నారు. 2014లో అధికారంలోకి వచ్చేందుకు వీరు టీడీపీకి ఆర్థిక దన్నుగా మారారు. ఈ క్రమంలో ఈ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడం ద్వారా వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఆర్థికంగా కోలుకోలేని షాక్ ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో అధికారాన్ని వినియోగించుకుంటున్నారు. అడ్మిషన్లలో కోత పెట్టారు. ఫీజుల్లో కోత పెట్టారు. కళాలలపై కొరడా ఝళిపిస్తున్నారు. వైద్య శాలలపై నిబంధనల కొరడాఎత్తుతున్నారు. ఇలా వారిని ఆర్ధికంగా దెబ్బతీయడం ద్వారా .. టీడీపీని ఒంటరిని చేయాలనేది జగన్ లక్ష్యంగా ఉందని ప్రచారం జరుగుతోంది. మరి ఏమేరకు ఆయన సక్సెస్ అవుతారో.. బాబు వీరిని ఎలా కాపాడుకుంటారో చూడాలి.