ఏపీ సీఎం జగన్ వేస్తోన్న ఎత్తులు, వ్యూహాలకు చంద్రబాబు విలవిల్లాడుతున్నారు. 40 సంవత్సరాల అనుభవం ఏమోగాని… పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే బాబుకు ముచ్చెమటలు పట్టేస్తున్నాయి. ఇక జగన్ ముందు నుంచి.. ఇంకా చెప్పాలంటే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఇతర పార్టీల సింబల్ మీద గెలిచిన నేతలను ఆ పదవికి రాజీనామా చేయకుండా తన పార్టీలో చేర్చుకునే ప్రశక్తే లేదని చెప్పారు.
జగన్ ముందు నుంచి అదే మాట మీద నిలబడ్డారు. అంతెందుకు నంద్యాల ఉప ఎన్నికకు ముందు శిల్పా చక్రపాణి రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాకే జగన్ పార్టీలో చేర్చుకున్నారు. 2012 ఉప ఎన్నికలకు ముందు నుంచి జగన్ ఇదే పంథా ఫాలో అవుతున్నారు. ఇక తాజాగా వల్లభనేని వంశీ విషయంలో జగన్ వేసిన ఎత్తుతో బాబుకు మైండ్ బ్లాక్ అయినట్టే ఏపీ రాజకీయ వాతావరణం చెప్పేస్తోంది.
వంశీ వైసీపీలో చేరతానని చెప్పారు.. వంశీ ఇప్పటికిప్పుడు వైసీపీలో చేరితే జగన్ సిద్ధాంతం ప్రకారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. అదే జరిగితే గన్నవరంకు ఉప ఎన్నిక ఖాయం. జగన్ ఉప ఎన్నికకు భయపడి.. టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోడనే బాబు భావించారు. కానీ ఇప్పుడు బాబు వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఇప్పుడు స్పీకర్ వంశీకి అసెంబ్లీలో ప్రత్యేక కుర్చీ వేస్తామని చెప్పారు. ఇక ఇక్కడే జగన్ మార్క్ అసలు రాజకీయం బయటపడింది.
రేపటి రోజున వంశీ వైసీపీ కండువా కప్పుకోకుండానే అసెంబ్లీ లోపల, బయట జగన్ ప్రభుత్వానికి తన ఫుల్ సపోర్ట్ ఇస్తాడు. ఇక రేపటి రోజున టీడీపీ నుంచి బయటకు వచ్చేందుకు రెడీగా ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఇదే పంథా ఫాలో అవుతారు. వాళ్లంతట వాళ్లుగా బయటకు రారు. పార్టీపై విమర్శలు చేసి, బాబు, లోకేష్‌ను చెడామాడా తిట్టేస్తారు.. పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురవుతారు. ఆ తర్వాత బీజేపీకి అనుబంధంగా ఉంటారో ? లేదా వైసీపీకి అనుకూలంగా ఉంటారో ? జగన్, మోదీలలో ఎవరి భజన చేసుకుంటారో ? వాళ్ల ఇష్టం. ఇక టీడీపీ నుంచి బయటకు వెళ్లే ఎమ్మెల్యేలను బాబు ఆపనూ లేరు.. జగన్ పార్టీలో చేర్చుకున్నారని విమర్శించనూ లేరు. అది కదా జగన్ మార్క్ అసలు సిసలు రాజకీయం..!