అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ -జనసేన పొత్తు నేపథ్యంలో కిషన్రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాణ్.. కాసేపట్లో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్నారు. అయితే తమకు 20కి పైగా స్థానాలు ఇవ్వాలని జనసేన కోరుతోంది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ లో జెఎస్పీకీ మంచి పట్టు ఉందని, నగరంలో సీట్లు ఇస్తే గెలిపించుకుంటామని అంటోంది. దీంతో జెఎస్పీకీ బీజేపీ ఎన్ని సీట్లు ఇస్తుందనే విషయంపై నడ్డా, పవన్ భేటీ అనంతరం క్లారిటీ వస్తుందో చూడాలి. అయితే బీజేపీ మాత్రం 6 నుంచి 10 సీట్లు ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం.
తెలంగాణలో 32 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించిన జనసేన.. ఆ నియోజకవర్గాల వివరాలను కూడా గతంలో విడుదల చేసింది. బీజేపీ ఫస్ట్ లిస్ట్ విడుదల చేయకముందు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ వెళ్లి పవన్‌తో చర్చలు జరిపారు. ఇప్పుడు పొత్తులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో చర్చించేందుకు పవన్ కల్యాణ్ త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు. లేదంటే ఈ నెల 27న రాష్ర్ట పర్యటనకు రానున్న అమిత్ షాతో హైదరాబాద్ లోనే చర్చలు జరిపే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. కాగా, అభ్యర్థుల రెండో లిస్ట్, జనసేనతో పొత్తుపై జాతీయ నేతలతో చర్చించేందుకు బీజేపీ రాష్ట్ర నేతలు బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. త్వరలో పార్టీ ఎన్నికల కమిటీ భేటీ అయి రెండో లిస్టుకు ఆమోదం తెలపనుంది. ఈ నెల 22న 52 మందితో బీజేపీ మొదటి లిస్ట్ విడుదల చేశారు. జనసేనతో పొత్తుపై స్పష్టత వచ్చాక రెండో లిస్ట్ విడుదల చేయనున్నట్టు నేతలు చెబుతున్నారు.