ఆలు లేదు సూలు లేదు: వీర్రాజు అత్యుత్సాహం – జనసైనికుల అనవసరావేశం!

-

ఆలు లేదు సూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అనే సామెతను గుర్తుకు చేసేలా ప్రవర్తిస్తున్నారు ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన కార్యకర్తలు! ఏపీలో ప్రస్తుతానికి బీజేపీ అధ్యక్షుడే మారారు తప్ప.. అంతకుమించిన అద్భుతాలు ఏమీ జరగలేదు. ఇక ఇప్పటికిప్పుడు రాత్రికి రాత్రి ఏపీలో నాలుగోస్థానంలో ఉన్న బీజేపీ.. మూడోస్థానంలో ఉన్న జనసేన కలిపి.. ముందుగా రెండోస్థానంలో ఉన్న టీడీపీని కొట్టిందీ లేదు… అయినా కూడా అప్పుడే మొదటిస్థానంలో అత్యంత బలంగా ఉన్న వైకాపాను ఓడించేశాం అనేస్థాయిలో మాటలు పెరిగిపోయాయి! అంతేకాదు… పొత్తు సమస్యలు కూడా స్టార్ట్ అయిపోయాయి!

వివరాల్లోకి వెళ్తే… రాబోయే ఎన్నికల్లో అధికారం మాదే అనేది అన్ని రాజకీయపార్టీలు చెప్పేమాట. ఎందుకంటే… సెల్ఫ్ మోటివేషన్ లో భాగమో.. కార్యకర్తలను ఉత్సాహపరిచే పనిలో భాగమో తెలియదు కానీ… అలాంటి స్టేట్ మెంట్స్ ఇస్తుంటాయి అన్ని పార్టీలు! ఈ విషయంలో కొత్తగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు మరో అడుగు ముందుకువేసి… 2024లో బీజేపీ – జనసేన అభ్యర్ధే ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పుకొచ్చారు. ఇదే “అతి” అంటే… ఆ మాటకు జనసైనికులు ఫైరయిపోవడం మరీ “అతి” అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

అసలు వచ్చే ఎన్నికల్లో అధికారమార్పిడి అనే మాటే అత్యశ అని చెప్పినా అతిశయోక్తి లేదు. ఎందుకంటే… ఏపీలో వైకాపా అంతబలంగా ఉంది.. ప్రభుత్వంలో జగన్ పాలన ఆ స్థాయిలో ఉంది. ఈ సమయంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ – జనసేన కీలక భూమిక పోషించబోతోంది అని చెపాల్సిన వీర్రాజు… ఏకంగా కాబోయే ఏపీ సీఎం బీజేపీ – జనసేన అభ్యర్ధే అని చెప్పారు. అక్కడినుంచి జనసైనికులు సోషల్ మీడియాకెక్కారు! పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి కాదా? బీజేపీ నాయకుల్లో కూడా ఏవైనా ఆశలున్నాయా? తమ నాయకుడి సత్తా ఏంటో తెలిసినా కూడా మిత్రపక్షం ఇలా మాట్లాడ్డం సరైనదేనా? అంటూ మొదలుపెట్టేశారు!

వీరి ఆశలు, అత్యాశలు, భ్రమల సంగతి కాసేపు పక్కనపెడితే… 2019 ఎన్నికల్లో జనసేనకు వచ్చిన ఎన్నికల శాతం 6.8%గా ఉండగా.. బీజేపీ 0.84శాతంగా ఉంది. విచిత్రం ఏమిటంటే… ఆ ఎన్నికల్లో కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కంటే కాంగ్రెస్ కు 1.17% ఓట్లు వచ్చాయి. ఈ ఘణాంకాలను చూసిన అనంతరం… సోము వీర్రాజు అత్యుత్సాహానికి – జనసైనికుల అనవసర ఆవేశానికి అసలు ఇది సందర్భమా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి!

Read more RELATED
Recommended to you

Exit mobile version