కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ నివాసంపై దాడి జరిగింది. ట్రాక్టర్‌తో ముద్రగడ నివాసం గేటును ఢీకొట్టాడు ఓ వ్యక్తి. అక్కడ పార్క్ చేసి ఉన్న కారును కూడా ట్రాక్టర్‌తో ఢీకొట్టాడు. అతను జనసేన కార్యకర్తగా అనుమానిస్తున్నారు ముద్రగడ వర్గీయులు. ప్రస్తుతం యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. తనకు50 వేలు ఇస్తానంటేనే ఎటాక్ చేశానని ఆ యువకుడు చెబుతున్నాడు.
తాజాగా జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు వైసీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ కారుపై దాడి ఘటనపై స్పందించారు. జనసేన పార్టీ విలువలతో ఏర్పడిన పార్టీ అని.. ఇలాంటి దాడులు ఎవరి మీద జరిగినా అది తప్పు అని తెలిపారు. ఈ దాడిని ఖండిస్తున్నాను. దాడి చేసిన వ్యక్తి జనసేన కార్యకర్త అని ప్రచారం జరుగుతుంది. ఆ వ్యక్తిని నేను జనసేన లో ఎప్పుడు చూడలేదు. పోలీసుల విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయని తెలిపారు. మరోవైపు ఈ దాడి విషయం తెలిసి ముద్రగడ పద్మనాభం అనుచరులు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఇటీవలే ప్రత్తిపాడు నియోజకవర్గంలో గ్రామస్థాయి పర్యటనలు మొదలు పెట్టారు ముద్రగడ కుమారుడు గిరిబాబు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు వైసీపీ సమన్వయకర్తగా ముద్రగడ పద్మనాభం తనయుడు గిరిని నియమించింది వైసీపీ అధిష్టానం.