కరోనా లాక్‌డౌన్ వల్ల వాయిదా పడ్డ కాంపిటీటివ్ పరీక్షలకు ఎట్టకేలకు ముహుర్తం కుదిరింది. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీలలో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల తేదీని ఖరారు చేశారు. ఆగస్టు 23వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష జరుగుతుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్‌డీ) మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్స్ పరీక్షలు జూలై 18 నుంచి 23వ తేదీ జరుగుతాయని అన్నారు. అలాగే మెడికల్ కాలేజీల్లో ప్రవేశం కోసం నిర్వహించే నీట్ ఎగ్జామ్ జూలై 26వ తేదీన జరుగుతుందని మంత్రి తెలిపారు.
కాగా ఈ ఏడాది జనవరిలోనే మొదటి విడత జేఈఈ మెయిన్స్‌ను నిర్వహించగా.. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ వల్ల ఏప్రిల్ 5 నుంచి 11వ తేదీ వరకు జరగాల్సిన జేఈఈ మెయిన్స్‌ను కేంద్రం ఆదేశాల మేరకు నేషనల్ టెస్టింట్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వాయిదా వేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం లాక్‌డౌన్ ఆంక్షలను సడలిస్తుండడంతో.. విద్యార్థుల కోసం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయం తీసుకుంది. అందుకనే తదుపరి జేఈఈ పరీక్షలను నిర్వహించనున్నారు.