రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి అనూహ్య షాక్ తగిలింది. సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ఏ పార్టీలో చేరకుండా స్వతంత్రంగా ఉంటానని తెలిపారు. గతంలో బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యల వల్లనే తాను బీఆర్ఎస్ పార్టీని వీడినట్టు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ను తాను ఎప్పుడూ విమర్శించలేదని స్పష్టం చేశారు.
తాజాగా జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తున్నట్టుగా తెలిపారు. గత ఏడాది మార్చి 06న కోనేరు కోనప్ప సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అంతకుముందు కోనప్ప 2014 ఎన్నికల్లో బీఎస్పీ పనుంచి పోటీ చేసి నాటి బీఆర్ఎస్ అభ్యర్థి కావేటి సమ్మయ్య పై కోనప్ప విజయం సాధించారు. ఎన్నికల తరువాత బీఆర్ఎస్ లో చేరారు. అనంతరం 2018లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2023లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్ చేతిలో ఓడిపోయారు. బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ను బీఆర్ఎస్ లో చేర్చుకోవడంతో అసంతృప్తికి గురైన కోనప్ప సీఎం సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు.