దేశంలో టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు సంచలనాలను సృష్టిస్తూనే ఉంది. టెలికాం మార్కెట్‌లో ఇతర కంపెనీలకు పోటీనిస్తూ జియో సత్తా చాటింది. ఇక బ్రాడ్‌బ్యాండ్ రంగంలోనూ తనదైన ముద్రను వేసేందుకు జియో రెడీ అవుతోంది. అందులో భాగంగానే త్వరలో జియో గిగాఫైబర్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఇక ఈ సేవలకు గాను నెలవారీ కనీస ప్లాన్ రూ.500 గా నిర్ణయించినట్లు తెలిసింది.
జియో గిగాఫైబర్ రిజిస్ట్రేషన్లు ఈ నెల 15వ తేదీ స్వాతంత్య్ర దినోత్సం రోజు నుంచి ప్రారంభం అవుతాయి. మై జియో యాప్, జియో వెబ్‌సైట్‌లలో రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తారు. జియోగిగాఫైబర్ సేవలను పొందేందుకు గాను కస్టమర్లు ముందుగా రూ.4500 రీఫండబుల్ డిపాజిట్ చెల్లించాలి. సేవలు వద్దనుకున్నప్పుడు ఆ మొత్తాన్ని తిరిగిస్తారు. ఇక రిజిస్ట్రేషన్లు ఎక్కువగా వచ్చిన నగరాల్లో ముందుగా జియో గిగాఫైబర్ సేవలను ప్రారంభిస్తారు. దీపావళి కంటే ముందుగానే ఈ సేవలను ప్రారంభిస్తారని సమాచారం.
జియో గిగాఫైబర్ సేవల ప్లాన్లు రూ.500 మొదలుకొని రూ.5500 వరకు ఉంటాయని సమాచారం. 100 ఎంబీపీఎస్ నుంచి 1జీబీపీఎస్ గరిష్ట స్పీడ్ ఈ సేవలతో లభిస్తుందట. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఇతర బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలు అందిస్తున్న దాని కన్నా 50 శాతం తక్కువ ధరకే జియో గిగాఫైబర్ ద్వారా బ్రాడ్‌బ్యాండ్ సేవలు లభ్యం కానున్నాయట. ఇలా లభించే ఇంటర్నెట్‌లో 1జీబీ డేటాకు అయ్యే ఖర్చు కేవలం రూ.2.70 మాత్రమేనట. ఇక బ్రాడ్‌బ్యాండ్‌తోపాటు డీటీహెచ్ సేవలను కూడా ఇదే ప్లాన్లలో అందిస్తారట. అవి కూడా ఇతర డీటీహెచ్ సేవలకన్నా 25 నుంచి 30 శాతం తక్కువ ధరకే లభించే అవకాశం ఉందట. ఏది ఏమైనా జియో గిగాఫైబర్ వస్తే మాత్రం అటు ఇతర బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలకు, డీటీహెచ్ కంపెనీలకు ముచ్చెమటలు పట్టక తప్పదు. చూద్దాం.. ఏం జరుగుతుందో..!