జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తరువాత తెలంగాణ రాష్ట్రంలోనూ ఆయన పర్యటిస్తారని తెలిసింది. ఏపీలో ఉత్తారంధ్ర పర్యటన ముగిశాక గోదావరి జిల్లాల్లోనూ జనసేనాని పర్యటిస్తారని సమాచారం. అయితే ఏపీలో అన్ని జిల్లాల్లోనూ పర్యటన ముగిశాకే తెలంగాణలో పర్యటించాలని పవన్ భావిస్తున్నట్లు తెలిసింది.
ఇక 2019 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ర్టాల్లోనూ పవన్ పోటీ చేయాలనుకుంటున్నారట. ఏపీతోపాటు తెలంగాణలోనూ మొత్తం స్థానాల్లో పవన్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. మొదట్లో కేవలం కొన్ని స్థానాల్లోనే పోటీ చేయాలని పవన్ భావించారట. కానీ చివరకు రెండు తెలుగు రాష్ర్టాల్లోనూ అన్ని స్థానాల్లో జనసేన అభ్యర్థులను బరిలోకి దింపుతారని సమాచారం.
ఈ ఏడాది ఆరంభంలో పవన్ తెలంగాణలో పర్యటించగా అప్పట్లో ఆయన సంచలన ప్రకటన చేశారు. తాను ఇక సినిమాలను వదిలేస్తానని, పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉంటానన్నారు. జనసేన పార్టీ బలోపేతంపై దృష్టి పెడతానన్నారు. అప్పట్లో ఆయన తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కొండగట్టు దేవాలయం నుంచి తన యాత్ర ప్రారంభించారు. అనంతరం ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించారు. ఇక 2019 ఎన్నికల సమయంలో తెలంగాణలో విస్తృతంగా పర్యటించడంతోపాటు దాదాపుగా అన్ని చోట్ల జనసేన పార్టీ నేతలతో విస్తృతంగా సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
పవన్ కల్యాణ్‌కు సహజంగానే రెండు తెలుగు రాష్ర్టాల్లోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో పార్టీ క్యాడర్‌ను సిద్ధం చేసేందుకు తన అభిమానులు కూడా కదలి వస్తారని పవన్ అనుకుంటున్నట్లు తెలిసింది. మరో వైపు జనసేన పార్టీలో పెద్ద ఎత్తున సభ్యులు చేరుతున్నారని, పార్టీ వైపు యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని పార్టీ కమిటీ ప్రతినిధులు చెబుతున్నారు. కాగా రెండు తెలుగు రాష్ర్టాల్లోనూ అన్ని స్థానాల్లో పోటీ చేయడంపై పవన్ ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి జనసేనాని తన నిర్ణయాన్ని ఎప్పుడు ప్రకటిస్తారో వేచి చూడాలి..!