రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎక్కడికక్కడ వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్న విషయం తెలిసిందే. మరో రెండ్రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలో ఇప్పటికే వరదలకు పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. దీంతో జిల్లాలోని పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ మేరకు భదాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు వర్షాలు తగ్గుముఖం పట్టేవరకు ఒంటిపూట తరగతులు నిర్వహించాలని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. దీంతో కొత్తగూడెం జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు బుధవారం మధ్యాహ్నం నుంచి స్కూళ్లకు సెలవు ప్రకటించాలని విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర చారి ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం మండల విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని చెప్పారు.